KCR : ప్రజాక్షేత్రంలో ఈ దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎండగడతాం.. కొట్లాడి కాపాడుకుంటాం
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివక్షతకు గురయిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల మేరకు కృష్ణా జలాలు పారుతున్నాయని తెలిపారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రధానంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైనే చర్చించామని వెల్లడించారు. మహబూబ్ నగర్ కు తీవ్ర అన్యాయం నాడు జరిగిందని, రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయంపై ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. రెండు పార్టీలు మహబూబ్ నగర్ జిల్లాకు ద్రోహం చేశాయని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. బచావత్ ట్రైబ్యునల్ లో ఈ ప్రాంతం నిరాదరణకు గురయిందని భావించి 17 టీఎంసీలు జూరాల ప్రాజెక్టుకు కేటాయించారన్నారు. 1974లో కేటాయిస్తే దానిని పట్టించుకున్నవారు లేరన్నారు.

