Fri Dec 05 2025 06:30:50 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ లో మార్పు వచ్చిందా? నిన్న సభ చూసిన వారికి ఎవరికైనా ఇదే అర్థమవుతుందిగా?
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లో ఓటమి తర్వాత ఏదైనా మార్పు వచ్చి ఉండవచ్చునేమోనని అందరూ భావించారు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ లో ఓటమి తర్వాత ఏదైనా మార్పు వచ్చి ఉండవచ్చునేమోనని అందరూ భావించారు. ఇకనైనా అందరిని కలుపుకుని వెళుతూ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆయన ముందుకు వెళతారని భావించారు. కానీ నిన్న జరిగిన సభ తీరు చూసిన వారికి ఎవరికైనా ఓటమి తర్వాత కూడా కేసీఆర్ లో ఇసుమంత మార్పు రాలేదని స్పష్టంగా తెలుస్తుంది. సిల్వర్ జూబ్లీ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటుంటే కనీసం పార్టీ కార్యాలయానికి రావాలన్న స్పృహ కూడా కేసీఆర్ లో కనిపించలేదు. తాను పెట్టిన పార్టీ ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ స్వయంగా వచ్చి పార్టీ కార్యాలంలో జెండా ఎగురవేస్తారనుకున్నా, ఆ బాధ్యతను తన కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారు.
లక్షలాది మంది నిరీక్షిస్తున్నా...
ఇక ఎల్కతుర్తిలో జరిగిన సభకు కేసీఆర్ ఆరున్నర గంటలకు కానీ చేరుకోలేదు. వరంగల్ లో లక్షలాది మంది కార్యకర్తలు, నేతలు వచ్చి నిరీక్షిస్తుంటే ముందుగా వచ్చి కార్యకర్తలను పలుకరించాలన్న ధ్యాస ఆయనకు లేకుండా పోయందన్న విమర్శలు వినపడుతున్నాయి. ఎన్నికలలో ఓటమి తర్వాత ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితమయిన కేసీఆర్ బయటకు రావడమే మానుకున్నారు. అదేమంటే ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు అన్యాయంగా కేసులు పెడితే సహించబోమని అన్న కేసీఆర్ నాడు ధర్నా చౌక్ లో కూడా ఆందోళనలు చేయకుండా ధర్నా చౌక్ ను ఎత్తివేసింది నిజం కాదా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ పైనే...
తాను ఉన్నప్పుడు తెలంగాణ బంగారంలా ఉండేదని, ఇప్పుడు పూర్తిగా దానిని మట్టిమయం చేశారని ఆరోపణలు కాంగ్రెస్ పైన చేశారు. అంతవరకూ బాగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అసలు ఏమీ అమలు చేయలేదని చెప్పడం ఏంటని హస్తం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర సమయంలోనే ఇచ్చిన హామీల్లో చాలా వరకూ పూర్తి చేశామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో పాటు కేసీఆర్ మునుపటిలాగా ప్రసంగంలో పస తగ్గినట్లే కనిపించింది. పంచ్ లు లేవు.. ఏదో నలభై నిమిషాలు మాట్లాడి అలా వెళ్లిపోయారు తప్పించి కొత్తగా కేసీఆర్ చెప్పిందేమీ లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఇంతోటి దానికి సిల్వర్ జూబ్లీ వేడుకల పేరిట ఇంత స్థాయిలో ఏర్పాట్లు చేస్తే ఉస్సూరుమనిపించి వెళ్లారని సభకు వచ్చిన కార్యకర్తలే అనుకోవడం వాస్తవమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
సభ జరిగిన తీరు...
నిన్నసభ జరిగిన తీరు.. ముందు.. తర్వాత పరిశీలిస్తే కేసీఆర్ లో ఎలాంటి మార్పు రాలేదని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఆయనకు ఓపిక లేదని, ఇన్ని లక్షలమంది సభకు వచ్చినా ఆయన సమయానికి రాకపోవడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా స్క్రిప్ట్ చూసి చదవడంపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయవచ్చు. అది రాజకీయాల్లో సహజమే. కానీ సొంత పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నాన్ని కేసీఆర్ చేయలేకపోయారంటున్నారు. ఆయనకు ఇంత పెద్ద సభ జరిగినా రావడానికి తీరిక, సమయం లేకపోతే, రేపు సచివాలయానికి వస్తారన్న గ్యారంటీ ఏంటని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
Next Story

