Fri Dec 05 2025 11:13:37 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఇంతకు ముందులాంటి కాంగ్రెస్ కాదు.. ఇప్పుడు సెట్ చేయడంలో సిద్ధ "హస్తు"లే
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. అలా ఆశించిన వారికి నిరాశ మిగిలింది

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. అలా ఆశించిన వారికి నిరాశ మిగిలింది. కానీ గతం కంటే భిన్నంగా ఈసారి మంత్రివర్గ విస్తరణ జరిగి వారం రోజుల గడుస్తున్నా అసంతృప్తి పెద్దగా లేదు. దాదాపు రెండేళ్ల తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణ జరిగితే పెద్దయెత్తున అసంతృప్తి చెలరేగుతుందని అందరూ భావించారు. మంత్రి పదవులు కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు ఇంకా ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉండటంతో అందరూ ఆశలు పెంచుకున్నారు. సామాజిక కోణంలోనూ, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా తమకు అవకాశం లభిస్తుందని చాలా మంది అనుకున్నారు. విస్తరణ జరిపితే అసంతృప్తి జ్వాలలు పెరుగుతాయని అంచాన వేసారంటున్నారు. అందుకే హైకమాండ్ కూడా ఇంతకాలం వాయిదా వేసుకుంటూ వస్తుంది.
మూడు పోస్టులను మాత్రమే...
అయితే హైకమాండ్ తెలివిగా మూడు పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. అదీ రెండు సామాజికవర్గాలకు చెందిన వారిని మాత్రమే ఎంపిక చేసింది. ఎస్సీ మాల సామాజికవర్గం నుంచి గడ్డం వెంకటస్వామిని ఎంపిక చేసింది. ఈయనతో పాటు అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకున్నప్పటికీ ఆయనకు లభించలేదు. కానీ ప్రేమ్ సాగర్ రావును తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడి ఆయనకు నచ్చ చెప్పారు. తన నియోజకవర్గానికి తానే రాజు.. తానే మంత్రి అనిచెప్పి కార్యకర్తలకు సర్దిచెప్పారు. దీంతో తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తామని ప్రేమ్ సాగర్ రావు ప్రకటించి ప్రత్యర్థుల ఆశలపై ఆయన నీళ్లు చల్లారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో అసంతృప్తి లేనట్లే అనుకోవాలి.
మంత్రి పదవుల కోసం...
ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత ఆయన తనకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ఎవరికీ ప్రాతినిధ్యం లేకపోవడంతో తనకు అవకాశం కల్పిస్తారని భావించారు. ఇక మునుగోడు ఎమ్మెల్యేకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తనకు హోం మంత్రి కావాలంటూ ఆయన కామెంట్స్ కూడా గతంలో చేశారు. జానారెడ్డి తన మంత్రి పదవికి అడ్డంపడ్డాడని కూడా గతంలో వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విస్తరణ తర్వాత మంత్రి పదవి శాశ్వతం కాదని, ఎమ్మెల్యే అంతకు మించిందని అన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కొంత అసంతృప్తికి లోనైనా మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడటంతో ఆయనకూడా సెట్ అయ్యారు. ఇలా కాంగ్రెస్ లో అసంతృప్తి పెరుగుతుందని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలిందని చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగిలిన మూడు పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడంతో వెయిట్ చేయడానికే నేతలు సిద్ధమయ్యారు తప్ప గీత దాటాలని ఎవరూ అనుకోవడం లేదు.
Next Story

