Fri Jan 30 2026 19:50:22 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కరెంటోళ్లను కంట్రోల్ చేయాలంటే కేసీఆర్ మళ్లీ రావాల్సిందేనా?
చిన్నపాటి వర్షం పడితే చాలు విద్యుత్తు సరఫరా నిలిచిపోతుంది.

చిన్నపాటి వర్షం పడితే చాలు విద్యుత్తు సరఫరా నిలిచిపోతుంది. హైదరాబాద్ నగరంలో కూడా తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుండటంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. వర్షంపడినా, ఎండకాచినా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి కొంత గాలులు వచ్చినా వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. గురువారం సాయంత్రం దాదాపు నాలుగు గంటలకు పైగా కరెంట్ సరఫరాను నిలిపేశారు. దీంతో ప్రజలు దోమల బాధలతో అల్లాడిపోయారు.
కేసీఆర్ పాలనలో...
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్తు సరఫరాలో పెద్దగా అంతరాయాలు ఉండేవి కావు. ఏదైనా అంతరాయం ఉన్నా వెంటనే విద్యుత్తును పునరుద్ధరించేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంటల కొద్దీ విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తుండటంతో ప్రజల్లో చిరాకు మొదలయింది. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. కరెంటోళ్లను కంట్రోల్ చేయాలంటే కేసీఆర్ రావాల్సిందేనంటూ చేస్తున్న కామెంట్స్ కాంగ్రెస్ పాలనకు అద్దంపట్టేలా ఉందన్న పోస్టులు కనిపిస్తున్నాయి.
వేసవిలో ఎక్కువగా వినియోగం...
వేసవిలో సహజంగా విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్తు వినియోగం ఎక్కువయినా సరే వెంటనే విద్యుత్తు నిలిచిపోతుండటం పలు ప్రాంతాల్లో జరుగుతుంది. కాంగ్రెస్ నేతలకు కరెంటోళ్లపై పట్టు లేకపోవడం వల్లనే ఈ రకంగా వారు వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వర్షం కురిసినప్పుడల్లా కరెంటు పోతే ఇక విద్యుత్తు శాఖ ఏం చేస్తున్నట్లు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు అమలు చేసినా, పథకాలను అందించినా విద్యుత్తు విషయానికి వచ్చేసరికి కొంత జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజల్లో మరింత అలుసుగా మారే అవకాశముంది. అదే సమయంలో విద్యుత్తు సరఫరాపై సమీక్షలు నిరంతరం చేయకపోవడం వల్ల అధికారుల్లోనూ, సిబ్బందిలోనూ అలసత్వం అలుముకుందని, దీనిని పారద్రోలకుంటే కాంగ్రెస్ సర్కార్ కు కరెంట్ షాక్ తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
Next Story

