Fri Dec 05 2025 12:57:35 GMT+0000 (Coordinated Universal Time)
టన్నెల్ లో ఇంకా ఎనిమిది మంది కార్మికులు.. రేవంత్ రెడ్డి ఆదేశాలివే
శ్రీశైలం ఎడమ కాల్వ గట్టు కింద ప్రమాదలో ఇంకా ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు

శ్రీశైలం ఎడమ కాల్వ గట్టు కింద ప్రమాదలో ఇంకా ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. అధికారుల సహాయక చర్యలు ప్రారంభించడంతో చాలా వరకూ సొరంగం నుంచి బయటకు వచ్చారు. మొత్తం నలభై మంది కార్మికులు టన్నెల్ నుంచి బయటకు రాగలిగారు. పోలీసుల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ లో ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు మార్నింగ్ షిఫ్ట్ లో పనిచేస్తుండగా ఒక్కసారిగా పై కప్పు కూలిపోయింది. పథ్నాలుగో కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇటీవలే ప్రభుత్వం ఈ పనులను ప్రారంభించింది.
నాలుగు రోజుల క్రితం...
నాలుగు రోజుల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. మూడు మీటర్ల మేర పై కప్పు కూలిపోవడంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు ప్రారంభంచారు. అయితే ముగ్గురు కార్మికులకు మాత్రం తీవ్ర గాయలు కాగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తును్నారు. సొరంగంలోని రింగ్ లు కిందపడటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. నలభై మంది కార్మికులు ఉండగా అందులో ముగ్గురికి గాయాలయ్యాయి. మిగిలిన వారు ఒక్కొక్కరుగా పోలీసుల సహకారంతో బయటకు వస్తున్నారు.
రేవంత్ రెడ్డి సమీక్ష...
అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులను వెళ్లాలని ఆదేశించారు. వీరంతా హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. అయితే చాలా మంది వరకూ సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎనిమిది మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారిని బయటకు తీసుకు వచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొత్తం మీద ప్రమాదం ఎందుకు జరిగింది? ఎంత మంది చిక్కుకున్నారన్న దానిపై ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం విద్యుత్తు సరఫరా నిలిపేసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Next Story

