Fri Jun 20 2025 10:27:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కులగణనసర్వే కరెక్ట్ గా జరిగిందా? అసలు చేసినట్లే అనిపించలేదే సామీ?
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కులగణన సర్వే ఆధారంగా జారీ చేయనున్నారు.

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కులగణన సర్వే ఆధారంగా జారీ చేయనున్నారు. అయితే కులగణనలో ఖచ్చితత్వం ఎంత? అన్న దానిపైనే ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇళ్లకు వచ్చి యజమానులు చెప్పిన వివరాల ఆధారంగానే నమోదు చేసుకుని సర్వే సిబ్బంది వెళ్లారు. అయితే ఇది ఖచ్చితమైన సమాచారం అనేది మాత్రం క్లారిటీ లేదు. కొందరు పొలాలు, ఆస్తులను దాచి ఉంచారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ప్రభుత్వ పథకాలు తమకు అందవన్న భయంతోనే ప్రజలు తమ ఆస్తుల విషయాన్ని బయటపెట్టలేదని కూడా వార్తలు వచ్చాయి. అదే సమయంలో సిబ్బంది కూడా తూతూమంత్రంగా చేసిన ఈ సర్వే ప్రాతిపదికన రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఎలా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది.
సర్వేలో ఖచ్చితత్వం ఎంత?
కులగణన లో అనేక ప్రశ్నలు వేశారు. యాభైకి పైగా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంలో సర్వే సిబ్బంది యాంత్రికంగానే వ్యవహరించారు. కనీసం వారి ఆదాయం గురించి కూడా ఆరా తీయలేదు. దీనివల్ల అనర్హులు ఎక్కువ మంది తెలుపు రంగు రేషన్ కార్డులు పొందే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. రేషన్ కార్డుల జారీకి కులగణన సర్వే ప్రాతిపదిక కాకూడదు. దానికి నిబంధనలు వేరుగా ఉంటాయి. ఆదాయ పరిమితితో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించడానికి అనేక మార్గాలున్నాయి. ఇప్పుడు తెలంగాణ జరిగిన కులగణన వల్ల ఖచ్చితమైన సమాచారం వచ్చిందన్న నమ్మకం ఎవరికీ లేదు. మరి దాని ప్రాతిపదికన ఎలా రేషన్ కార్డులు మంజూరు చేస్తారన్న ప్రశ్నకు పాలకుల వద్ద సమాధానం లేదు.
పాతరేషన్ కార్డులు తొలగించమంటూ...
పాత రేషన్ కార్డులను కూడా తొలగించే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 26 నుంచి తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ జరగనుంది. రేషన్‌కార్డుల ఫైనల్ లిస్ట్ ను దాదాపు అధికారులు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కొత్తగా ఆరున్నర లక్షల రేషన్‌కార్డులు ప్రభుత్వం జారీ చేసే అవకాశముందని కూడా చెబుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను కూడా గ్రామసభలో నిర్ధారించి రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకుందని చెబుతున్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కూడా ప్రకటన చేసింది. అయితే అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని, అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేసేలా కేవలం కులగణన సర్వేపై ఆధారపడవద్దన్న సూచనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story