Fri May 23 2025 02:01:03 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఈ ఆంక్షలేమిటి? తెలంగాణ నేతల ఆగ్రహం
టీటీడీ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజల్లో ఆగ్రహాన్నినింపుతుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలోనూ పాత సెంటిమెంట్ రగిలే అవకాశముందా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజల్లో ఆగ్రహాన్నినింపుతుంది. వారానికి రెండు సార్లు మాత్రమే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సుల లేఖలను అనుమతించాలని తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలసి ఉన్న సమయంలో అన్నదమ్ముల్లాగా ఉన్న వారిని విడగొట్టే ప్రయత్నం ఏపీ సర్కార్ చేస్తుందన్న ఆరోపణలు చేస్తూ పెద్దయెత్తున కామెంట్స్ పెడుతున్నారు. గతంలోనే టీటీడీ ఈవో శ్యామలరావు చేసిన ప్రకటనతో ఆగ్రహం వ్యక్తమవయింది.

సిఫార్సు లేఖలను...
తాము తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను తీసుకోబోమని తెలపడంతో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. ఇలాంటి నిర్ణయాలు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడతాయని కొందరు నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇప్పుడు వారానికి రెండు రోజులు మాత్రమే సిఫార్సు లేఖలకు అనుమతి ఇస్తామని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించబోరని కొందరు నేతలు అంటున్నారు.
అలాగయితే...?
వారానికి కేవలం రెండు సార్లు మాత్రమే సిఫార్సు లేఖలకు నిజంగా అనుమతించేటట్లయితే తెలంగాణలోనూ ఏపీకి చెందిన రాజకీయ నేతలకు సంబంధించిన వ్యాపారాలపై ఆంక్షలు విధించాలంటూ కొందరు ఇప్పటికే సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకు వేల సంఖ్యలో తెలంగాణ నుంచి వెళుతున్నారు. అంతటి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న తిరుమల కొండపై ఈ నిషేధం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాగయితే తాము కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్పి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చంద్రబాబు సమర్ధిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story