Sat Dec 13 2025 22:33:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మొంథా తుపాను ఇటు మళ్లింది.. తెలంగాణకు గండమే
మొంథా తుపాను తీరం దాటింది. అయితే తీరం దాటిన తర్వాత తెలంగాణకు భారీ ప్రభావం కనిపిస్తుంది

మొంథా తుపాను తీరం దాటింది. అయితే తీరం దాటిన తర్వాత తెలంగాణకు భారీ ప్రభావం కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో ఉదయం నుంచి మొదలయిన వర్షం ఇంత వరకూ తెరపివ్వకుండానే కురుస్తుంది. హైదరాబాద్ లోని దోమలగూడ, బాగ్ లింగంపల్లి, చిక్కడపల్లి, జవహర్ నగర్, పహాడీ షరీఫ్, తుక్కుగూడ, మహేశ్వరం, బడంగ్ పేట్, బాలాపూర్, మీర్ పేట్, బీఎన్ రెడ్డి నగర్, బర్కత్ పురా, నల్లకుంట, కాచిగూడ, అంబర్ పేట్, భోలక్ పూర్, కవాడిగూడ, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, నానక్ రాం గూడ, ఖాజాగూడ, గచ్చిబౌలి, దిల్ షుఖ్ నగర్, ఎల్.బి.నగర్, సరూర్ నగర్, హయత్ నగర్ లలో నిరంతరాయంగా వర్షం పడుతుంది. హైదరాబాద్ లోని పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష...
ఇక మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, నదులు పొంగిపొరలుతున్నాయి. ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. ఎవరూ వాగులను, నదులను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు అక్కడ బోర్డులను ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అందులోకి తరలించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ జిల్లాలకు అలెర్ట్...
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మేడ్చల్ రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లోఅతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాల్లో బారీ వర్షాలు పడతాయని భావించి ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Next Story

