Fri Dec 05 2025 11:37:27 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సీపీఐ ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యం బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
సీపీఐ ఎమ్మెల్సీ పదవికి నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలవుతుండగా అందులో మూడు స్థానాలను తాము తీసుకుని ఒకటి మిత్రపక్షమైన సీపీఐకి కాంగ్రెస్ ఇచ్చింది. సీపీఐ ఈ ఒక్క ఎమ్మెల్సీ పదవికి నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది. అయితే అనేక మంది సీనియర్ నేతలున్నప్పటికీ నెల్లికంటి సత్యం పేరు ఎమ్మెల్సీగా ఖరారు చేయడంతో అందరూ ఆయన ఎవరన్నది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే సీపీఐతో నెల్లికంటి సత్యానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. అయితే దీంతో పాటు ఆయన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతానికి నెల్లికంటి సత్యం కృషి చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉన్నత విద్యను చదివి...
నల్లగొండ జిల్లాకు చెందిన నెల్లికంటి సత్యం ఉన్నతవిద్యను చదివారు. పొలిటికల్ సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేశారు. ఆయన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. 1985 నుంచి సీపీఐలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 1985 నుంచి 2000 సంవత్సరం వరకూ ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నిర్వహించారు. తర్వాత 2010 నుంచి 2016 వరకూ మునుగోడు మండల కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2020 నుంచి జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన నెల్లికంటి సత్యం పార్టీ ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తూ నల్లగొండ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా విజయవంతంగా జరపడంలో సక్సెస్ అయ్యారు.
మునుగోడు ఎన్నిక సమయంలో...
అయితే నెల్లికంటి సత్యం 2023 ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేయాలని భావించారు. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా అక్కడ పోటీ చేయాలని ఆదేశించింది. దానికి నెల్లికంటి సత్యం సిద్ధమవుతున్న సమయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కొత్త గూడెం స్థానం దక్కడంతో ఇక మునుగోడు నుంచి నెల్లికంటి సత్యం తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో నెల్లికంటి సత్యానికి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చిన అధినాయకత్వం ఈ మేరకు అవకాశం వచ్చిన వెంటనే దానిని అమలు చేసింది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి చాడా వెంకటరెడ్డి పేరు పరిశీలనకు వచ్చినా ఆయన తనకు వద్దని చెప్పడంతో నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది.
Next Story

