Sat Dec 06 2025 16:24:08 GMT+0000 (Coordinated Universal Time)
Charlapalli Drugs : ఏడాది నుంచి డ్రగ్స్ తయారు చేస్తూ.. కోట్ల రూపాయలు కొల్లగొడుతూ?
చర్లపల్లిలో కొన్నేళ్ల నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నా పసిగట్టలేకపోయారు. ఏకంగా ఇక ఫ్యాక్టరీని పెట్టి డ్రగ్స్ ను తయారు చేస్తున్నా ఏమాత్రం కనిపెట్టలేకపోయారు

కొన్నేళ్ల నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నా పసిగట్టలేకపోయారు. ఏకంగా ఇక ఫ్యాక్టరీని పెట్టి డ్రగ్స్ ను తయారు చేస్తున్నా ఏమాత్రం కనిపెట్టలేకపోయారు. కానీ ముంబయి పోలీసులు మాత్రం తమకు అందిన సమాచారంతో నిఘా వేసి మరీ పట్టుకోగలిగారు. హైదరాబాద్ లోనే డ్రగ్స్ తయారవుతున్నప్పటికీ మనకు పట్టలేదు. కనీసం అటువైపు దృష్టి సారించలేదు. డ్రగ్స్ తయారీని ఒక పరిశ్రమగా మార్చి అందరినీ ఏమార్చి నిందితుడు కోట్లకు పడగలెత్తుతున్నా పట్టుకోలేకపోయారు. చర్లపల్లిలోని వాగ్దావి లేబరేటరీస్ ను అధికారులు కొన్నేళ్లుగా ఎవరూ తనిఖీ చేయకపోవడం ప్రభుత్వ శాఖల డొల్లతనం బయటపెట్టినట్లయింది. ముంబయి కానిస్టేబుల్ ఒకరు అందులో ఉద్యోగిగా చేరి పూర్తి సమాచారాన్ని తమ వారికి చేరవేసి పట్టుకోగలిగారంటే మన నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
చర్లపల్లిలో జరుగుతున్నా...
చర్లపల్లి పారిశ్రామిక వాడలో మేఫిడ్రోన్ డ్రగ్ రాకెట్ కేసులో అరెస్టయిన వాగ్దేవి లాబొరేటరీస్కి చెందిన ఇద్దరు అనుమానితులను ముంబయికి తరలించారు. కుషాయిగూడ స్థానిక కోర్టు నుండి ట్రాన్సిట్ వారంట్ పొందిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసుల కథనం ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితుడు విజయ్ వోలేటి వాగ్దేవి లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానిగా ఉన్నారు. తాతాజీ అందులో కెమిస్ట్ గా పనిచేస్తున్నాడు.వీరిద్దరిని ఈరోజు ముంబయి కోర్టులో హాజరుపరచనున్నారు. వీరిని కస్టడీకి తీసుకుని విచారణను మరింతగా కొనసాగించనున్నట్టు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ ఏడాది నుంచి మెఫిడ్రోన్ డ్రగ్ సరఫరా చేస్తున్నట్లు ఇప్పటివరకు దర్యాప్తులో వెల్లడయినట్లు తెలిసింది.
నిందితులను అదుపులోకి తీసుకుని...
పోలీసులు ఇప్పటివరకు 5.79 కిలోల మేఫిడ్రోన్, 35,500 లీటర్ల రసాయన ద్రావణాలు, 950 కిలోల పొడి, డ్రగ్ తయారీ పరికరాలు మరియు ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 12 మంది నిందితులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసిన రసాయనాల ద్వారా దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు తయారు చేసే అవకాశముందని పోలీసులు అంచనా వేశారు. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ తయారు చేసి హైదరాబాద్ నుంచి ముంబయికి తరలించడానికి నిందితులు ప్లాన్ చేశారు. ఒక బంగ్లాదేశ్ యువతిని ముంబయిలో అరెస్ట్ చేయడంతో ఆమె విచారణలో ఈ విషయం బయటపడింది. దీంతో పక్కా నిఘా వేసి మరీ పట్టుకోగలిగారు. 23.97 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Next Story

