Mon Mar 23 2026 20:08:20 GMT+0530 (India Standard Time)
Congress : అక్కరకు రాని నేతలను అక్కున చేర్చుకుని కాంగ్రెస్ తప్పు చేస్తుందా?
కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీనే ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి

కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీనే ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి. కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ ఓటు బ్యాంకు ఉన్న నేతలను దగ్గరకు తీసే పరిస్థితి ఉండదన్నది వాస్తవం. ఇక తాజాగా జీవన్ రెడ్డి వంటి బలమైన నేత పార్టీని వీడుతున్నారు. ఆయనకు మరోసారి ఎలాంటి పదవి ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకత్వం చేసిన తప్పిదం పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గా విజయశాంతిని ఎంపిక చేయడమేంటి? ఆమె కొన్ని నెలలుగా అసలు పార్టీ కార్యక్రమాల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు.
ఎందుకు పదవి ఇచ్చినట్లంటూ...
అసలు విజయశాంతికి ఎందుకు పదవి ఇచ్చినట్లన్నది కాంగ్రెస్ రాష్ట్ర నేతలకే అంతుపట్టడం లేదు. గాంధీ భవన్ కు రారు. మండలిలో మాట్లాడరు. బయట ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. తాను అందరికంటే అతీతమైన నేతగా విజయశాంతి భావిస్తున్నట్లుదన్న కామెంట్స్ పార్టీలోనే వినపడుతన్నాయి. ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుని ఆమె పేరు ఖరారు చేసుకుంటే ఇలాగే ఉంటుందని, సీనియర్ నేతలను పక్కనపెట్టి అక్కరకు రాని నేతలను ఎందుకు అక్కున చేర్చుకున్నట్లో నన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆమె వల్ల ఓట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాగని చరిష్మా ఉన్న నాయకురాలు కూడా కాదంటున్నారు.
ఎవరితో సంబంధం లేకుండా...
పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారి సలహాలు, సూచనలు తీసుకోకుండా విజయశాంతి ఎంపిక జరిగిందని అంటున్నారు.ప్రభుత్వ సంక్షేమపథకాలను కూడా జనాలకు చేరవేయడంలో విజయశాంతి పాత్ర తక్కువనే చెప్పాలి. తక్కువే కాదు అస్సలు లేదనే చెప్పాలి. కాంగ్రెస్ లో చేరిన తర్వాత గాంధీభవన్ కు వచ్చింది కూడా వేళ్ల మీద లెక్కించ వచ్చు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే విజయశాంతికి పార్టీ హైకమాండ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సీనియర్ నేతలను, అక్కరకు వచ్చే నేతలను పక్కన పెట్టడంపై హస్తం పార్టీలో పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.
Next Story

