Fri Dec 05 2025 11:37:35 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కొండా మురళిపై యాక్షన్ తీసుకుంటారా? అంత సీన్ ఉందా?
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై చర్య తీసుకోవాల్సిందేనని వరంగల్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై చర్య తీసుకోవాల్సిందేనని వరంగల్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది. లేకుంటే తాము ఇలాంటి అవమానాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు వరంగల్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాట అనిపించుకుంది తామని, తిరిగి తమనే క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవడమేంటని వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమిటీ ఎదుట అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే వాస్తవాలు తెలుసుకోవాలంటే ఇరు పక్షాల వాదనలను ఎవరైనా వినాల్సి ఉంటుందని, సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే అందరి వాదనలను వినాల్సిన బాధ్యత కమిటీ మీద ఉంటుందని చెప్పారు.
తాము కూడా బహిరంగంగానే...
అయితే వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తాము ఇక ఎక్కువ సమయం ఉపేక్షించలేమని, కొండా మురళి తన ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని తెలిపారు. తాము ఆ నిర్ణయం తీసుకోక ముందే కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము హైకమాండ్ వరకూ వెళ్లి తమ నిరసనను తెలియజేస్తామని క్రమశిక్షణ కమిటీ ఎదుట చెప్పినట్లు తెలిసింది. తమను బహిరంగంగానే దూషించిన కొండా మురళిని అలా వదిలేస్తే ఇక తమను ఎవరు జిల్లాలో లెక్క పెడతారని, తమకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తాము కూడా బహిరంగంగానే కొండా కుటుంబం పై విమర్శలు చేయడానికి రెడీ గా ఉన్నామని కూడా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవికి చెప్పినట్లు తెలిసింది.
తమను దూషించిన వారిని వదిలేసి...
అందుకు మల్లు రవి తనకు కొంత సమయం ఇవ్వాలని కోరారని, కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు మీడియాకు చెప్పవద్దని కూడా ఎమ్మెల్యేలకు మల్లు రవి సూచించారు. కాగా వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు vs కొండా మురళిగా మారిపోయింది. ఈ వివాదం తెగదు తెల్లారేటట్లు లేదని ఎమ్మెల్యేలే కమిటీ ఎదుట అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తమను దూషించిన వ్యక్తి నేరుగా కమిటీని కలసి, చివరకు వినతి పత్రంలోనూ తమను తప్పుపడుతూ ఇచ్చినప్పటికీ కమిటీ ఏం చేయకుండా మీన మేషాలు లెక్క పెడితే ఎలా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. తాము కూడా బహిరంగ వేదికలపై విమర్శలు చేసుకుంటూ పోతే పార్టీ పరువు బజారున పడుతుందని కూడా ఒక రకంగా హెచ్చరించినట్లు తెలిసింది.
భోజనాలకు కూడా వెళ్లకుండా...
క్రమశిక్షణ కమిటీ సంఘం కమిటీ ఛైర్మన్ మల్లు రవి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ భోజనాలకు పిలవగా, అందుకు వారు సున్నితంగా నిరాకరించి వెళ్లడం కూడా కమిటీపై అసంతృప్తిని వెళ్లగక్కినట్లయిందని అంటున్నారు. మరొక వైపు క్రమశిక్షణ కమిటీ కొండా మురళిపై చర్యలు తీసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఎమ్మెల్యేల ఒత్తిడి, మరొక వైపు జిల్లాలో బలమైన నాయకుడు మధ్య జరిగిన వివాదం కావడంతో సున్నితంగా దీన్ని పరిష్కరించడానికి క్రమశిక్షణ కమిటీ ప్రయత్నిస్తుందని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఇద్దరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే తప్ప సమస్యకు పరిష్కారం లభించదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ కమిటీ అంటే పెద్దగా ఎవరికీ భయం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ.ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటారన్నది మాత్రం అత్యాశే అవుతుంది.
Next Story

