Fri Dec 05 2025 22:46:33 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఆగిపోవడానికి కారణమదేనా?
కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. యూరియా కొరత, భారీ వర్షాలతో జనహిత పాదయాత్రకు బ్రేక్ పడింది.

కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. యూరియా కొరత, భారీ వర్షాలతో జనహిత పాదయాత్రకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జిల్లాల్లో జనహిత పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం వారు ఈ యాత్రలను ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అమలు చేసిన హామీలతో పాటు అభివృద్ధి పనులను వివరించేందుకు ఈ జనహిత పాదయాత్రలు ఉపయోగపడతాయని అంచనా వేశారు. కానీ వాతావరణ పరిస్థితులతో పాటు యూరియా కొరత వంటి సమస్యలు ఆటంకంగా మారాయి.
యూరియా దొరకక...
ఇప్పటికే తెలంగాణలో రైతులు యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సహకార కేంద్రాల కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలోరైతులు తెల్లవారు జాము నుంచే బారులు తీరుతున్నారు. చెప్పులను క్యూ లైన్లలోనే ఉంచి రాత్రి వేళ జాగారం చేస్తున్నారు. కేంద్రం సరఫరా చేయాల్సిన యూరియా రాష్ట్రానికి సరిపడా రాకపోవడంతో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ రైతులు మాత్రం యూరియా సంక్షోభంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో అలాగే ఇటీవలి వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రజలు కూడా తమ ఆస్తులను వరదల వల్ల కోల్పోయారు. వారికి పరిహారం ఇంత వరకూ దక్కలేదు. కేంద్ర ప్రభుత్వానికి వరద నష్టంపై అంచనాలను పంపామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ప్రజల నుంచి వ్యతిరేకత...
అయితే ఇలాంటి సమయంలో జనహిత పాదయాత్రను చేపడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అందువల్ల తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో దశను వాయిదా వేసినట్లు సమాచారం అందుతోంది. ఈ ఏడాది జూలై 31న ప్రారంభమైన జనహిత పాదయాత్ర అప్పటి నుంచే వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తొలుత ఈ పాదయాత్రను ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చేపడతారని ప్రకటించారు. కానీ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను నడిపిస్తారని నిర్ణయించడంతో కొంత వరకూ పార్టీలో సుముఖత వ్యక్తమయింది.
రెండో దశ యాత్రను...
ఆగస్టు నాలుగో తేదీ వరకు పాదయాత్ర జరిపి తర్వాత అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ నిలిపేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయలుదేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తరువాత పాదయాత్ర తిరిగి మొదలైంది. ఆగస్టు 22న ఏఐసీసీ ఇన్ఛార్జి అదిలాబాద్ లోని ఇంద్రవెల్లి గ్రామాన్ని ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. ఆగస్టు 25న వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రెండు రోజుల పాటు పాదయాత్ర జరిగింది. అప్పటి నుండి ఈ కార్యక్రమం నిలిచిపోయింది. తర్వాత భారీవర్షాలు, యూరియా కొరతతో ఈ జనహిత పాదయాత్ర ను వాయిదా వేసినట్లు తెలిసింది. రెండో దశలో ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ పూర్వ జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రోజులు వాయిదా వేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని పార్టీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
Next Story

