Fri Dec 05 2025 07:11:04 GMT+0000 (Coordinated Universal Time)
Azharuddin : అజార్ భాయ్ డకౌట్ అయినట్లేనా? మరో ఊరమాస్ లీడర్ ఎంట్రీ ఇచ్చినట్లేనా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చేటట్లే కనిపిస్తుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చేటట్లే కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేందుకు అవసరమైన వ్యూహంలో భాగంగా అజారుద్దీన్ ను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేసుకున్న అజహరుద్దీన్ పేరుపై రేవంత్ రెడ్డి సంతృప్తికరంగా లేరు. అజారుద్దీన్ ప్రజలకు అందుబాటులో ఉండే నేత కాకపోవడంతో పాటు ఆయన మాస్ లీడర్ కాకపోవడంతో పార్టీ గెలుపునకు ఇబ్బందికరంగా మారుతుందని పీసీసీ కూడా భావిస్తుంది. దీంతో హైకమాండ్ కు నచ్చ చెప్పి అజారుద్దీన్ ను పక్కకు తప్పించేందుకు నిర్ణయం ఫైనల్ అయినట్లు తెలిసింది.
మొదటి నుంచి వ్యతిరేకత...
అజారుద్దీన్ పేరును మొదటి నుంచి పీసీసీ వ్యతిరేకిస్తోంది. అనేక మంది నేతలు పోటీకి ఉత్సాహం చూపుతున్నప్పటికీ గెలుపు గుర్రం కోసం ఒక పేరును ఫైనల్ చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. జూబ్లిహిల్స్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ లో చిన్న శ్రీశైలం యాదవ్ పేరు అందరికీ తెలుసు. చిత్ర పరిశ్రమతో కూడా చిన శ్రీశైలం యాదవ్ కు మంచి సంబంధాలున్నాయి. చిన శ్రీశైలం యాదవ్ కుమారుడే నవీన్ యాదవ్. బస్తీల్లో పట్టు ఉన్న కుటుంబం కావడంతో పాటు. ముస్లిం వర్గాల్లోనూ వారికి గ్రిప్ ఉండటంతో తమకు కలసి వచ్చే అంశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే వారికున్న బ్యక్ గ్రౌండ్ తో ఆ కుటుంబానికి ఏ పార్టీ టిక్కెట్లు ఇచ్చేవి కావు.
పట్టున్న కుటుంబం కావడంతో...
దీంతో చిన శ్రీశైలం యాదవ్ కుటుంబం గతంలో మజ్లిస్ లో చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో అజారుద్దీన్ కు టిక్కెట్ ఇచ్చినా నవీన్ యాదవ్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. మజ్లిస్ తరపున నవీన్ యాదవ్ 2014లో పోటీ చేసి తొమ్మిది వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా టిక్కెట్ దక్కలేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2023లోనూ మజ్లిస్, బీఆర్ఎస్ ల మధ్య మైత్రి ఉండటంతో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రేవంత్ ఆయన కుటుంబం మాస్ పవర్ పై నమ్మకంతో వారికే టిక్కెట్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది.
హైకమాండ్ కు ఇప్పటికే...
ఉప ఎన్నిక అని తీసిపారేయడానికి లేదు. నవీన్ యాదవ్ అయితేనే గెలుపు అవకాశాలుంటాయని భావించిన రేవంత్ టీం నవీన్ యాదవ్ పేరును ఇప్పటికే హైకమాండ్ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అజారుద్దీన్ కు ఉన్న డిజట్వాంజేలతో పాటు నవీన్ యాదవ్ కు ఉన్న అడ్వాంటేజీలను కూడా సోదాహరణంగా పార్టీ అగ్రనాయకత్వానికి వివరించినట్లు సమాచారం.అయితే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అభ్యర్థి పేరు ఖరారవుతుందని తెలిసింది. రేవంత్ రెడ్డి కూడా ఇదే నియోజకవర్గంలో నివాసముండటంతో ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే అజారుద్దీన్ కు అనుకూలంగా థర్డ్ ఎంపైర్ అయన హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకోకపోవచ్చన్నది కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మొత్తం మీద అజారుద్దీన్ కు టిక్కెట్ దక్కడం దాదాపు పరిస్థితులు క్లిష్టంగా మారినట్లేనని అంటున్నారు.
Next Story

