Fri Dec 05 2025 13:35:38 GMT+0000 (Coordinated Universal Time)
Ration Cards in Telangana : గుడ్ న్యూస్... కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. మే నెల నుంచి సన్న బియ్యం మీ ఇంట్లో
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి అంతా సిద్ధం చేసింది

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి అంతా సిద్ధం చేసింది. గ్రామ సభలను నిర్వహించి వారి నుంచి అర్జీలను తీసుకున్న తర్వాత అర్హులను నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డు దారులను ఎంపిక చేయడం ద్వారా వారికి అన్నీ ఉచితాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మే నెల నుంచి అందనున్నాయి. కొత్త రేషన్ కార్డు దారులందరికీ వారికి సంబంధించిన కార్డులను ఈ నెలాఖరులోపు మంజూరు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తి కావడంతో పాటు మూడేళ్లు నిండిన వారిందరికీ మే నెల నుంచి కొత్త రేషన్ కార్డుపై ఆరు కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేయనుంది.
లక్షల్లో దరఖాస్తులు...
గ్రామసభల ద్వారా మాత్రమే కాకుండా మీ సేవ కేంద్రాల ద్వారా కూడా లక్షల సంఖ్యలో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత పదేళ్ల నుంచి తమకు రేషన్ కార్డు లేదని, తమ ఆర్థిక పరిస్థితిని చూసి అందించాలని వారు అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వం కూడా అర్హులైన పేదలు ఎంత మంది ఉన్నా అందరికీ తెలుపు రంగు రేషన్ కార్డులు అందచేస్తామని తెలిపింది. దీంతో కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా, వారు పెళ్లిళ్లయి బయటకు వెళ్లిపోయినా వారి పేరు మీద కూడా కొత్త రేషన్ కార్డును మంజూరు చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది సభ్యులన్నప్పటికీ ఒక్కొక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేయనుండటంతో వీటికి డిమాండ్ పెరిగింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్థానికత గుర్తింపుతో పాటు అనేక రకాలైన ధ్రువీకరణ పత్రాలను రేషన్ కార్డు మంజూరుకు అడిగే వారు. వాటి ఆధారంగానే జారీ చేసేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులన్నీ రద్దు చేసి ఆహార భద్రత కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు అది సాధ్యం కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో పాటు జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. మే నెలలో లబ్దిదారులు సన్న బియ్యం అందుకునే విధంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న ప్రభుత్వం ఆదేశం మేరకు మరో నాలుగు రోజుల్లోనే ఈ కొత్త రేషన్ కార్డుల జారీ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో కొన్ని లక్షల కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా లబ్ది చేకూరనుంది.
Next Story

