Sat Dec 13 2025 22:33:22 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : చలిగాలులు చంపేస్తున్నాయ్.. ఇంకా ఎన్ని రోజులంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ని

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్న మొన్నటి వరకూ వర్షాలు.. నేడు చలితో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటల వరకూ చలి ప్రభావం కొనసాగుతుంది. నిజానికి ఈశాన్య రుతుపవనాలు ఈ నెల మధ్య వరకు ఉండాల్సి ఉన్నా, మొంథా తుపాన్ ప్రభావంతో అవి త్వరగానే వెళ్లిపోయాయి. సెప్టెంబర్ 14 వ తేదీన నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలవ్వగా, అక్టోబర్15 నాటికి పూర్తిగా నిష్క్రమించాయి. ఆ వెంటనే ఈశాన్య రుతుపవనాల కాలం మొదలుకాగా.. ఈ నెల మొదటి వారంలోనే అవి కూడా నిష్క్రమించాయి. మొంథా తుపాను తో పాటే తేమ అంతా కూడా వెళ్లిపోవడంతో రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏపీలోనూ చలిగాలులు...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలిగాలుల తీవ్రత పెరిగింది. ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో చలి ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు చలి గాలులు పెరిగాయి. దీంతో గత రెండు రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఇస్రో అంచనాల మేరకు మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారకపోతే మరో పదిహేను రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది గత ఏడేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చలి ప్రభావం అధికమైంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 20 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 జిల్లాల్లో 15 డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
తెలంగాణలో చలి తీవ్రత...
నవంబర్ 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు టు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ వరకు పడిపోవచ్చంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14 నుంచి 17 డిగ్రీల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత తరచుగా ఉండదు, కానీ ఈ సంవత్సరం 8-10 రోజుల పాటు తీవ్రమైన చలి వాతావరణం ఉండనుంది. హైదరాబాద్‌లోనూ చలి వణికిస్తున్నది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం ఉంటున్నది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చలిగాలుల తీవ్రత వల్ల అనారోగ్యం ఎక్కువగా ఉంటుందని తెలిసింది.
Next Story

