Wed Feb 19 2025 20:48:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : చలి తీవ్రత ఇంకా తగ్గలేదే.. జనవరి నెల ముగుస్తున్నా ఈ వణుకుడేంది?
తెలంగాణలో చలితీవ్రత ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలంగాణలో చలితీవ్రత ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంక్రాంతి పండగ తర్వాత కొంత చలితీవ్రత తగ్గుతుందని భావించినా ఏమాత్రం తగ్గలేదు. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం పది గంటల వరకూ చలితీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఐదు గంటల నుంచి చలితీవ్రత పెరుగుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. చలి నుంచి కాపాడుకోవడానికి అనేకరకమైన పాట్లు పడుతున్నారు. స్వెటర్లు, మంకీక్యాప్ లు ధరించి చలి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పొగమంచు కారణంగా...
ఇక పొగమంచు కూడా విపరీతంగా పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ కు చేరుకునే సమయంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. టోల్ గేట్ ప్రాంతాల్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. ఈ సమయంలో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు నిదానంగా వస్తుండటంతో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పోలీసులు దగ్గరుండి వాహనాలను పంపించి వేస్తున్నారు. మరోవైపు ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. ఆగి ఉన్న వాహనాలను వెనక నుంచి ఢీకొట్టి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. దీనికి పొగమంచు కారణమని పోలీసులు చెబుతున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్టంగా ఆదిలాబాద్ జిల్లాలో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. మరోవైపు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే వ్యాధుల బారినపడే అవకాశముందని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికరోగాలతో బాధపడే వారు తగిన జాగ్రత్తలు పాటించకపోతే జ్వరం, ఒళ్లునొప్పులు, జలుబు వంటి వ్యాధుల బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం వేళల్లో హైదరాబాద్ వంటి నగరాల్లో రోడ్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి.
Next Story