Wed Dec 31 2025 06:12:07 GMT+0000 (Coordinated Universal Time)
Cold Waves : గడ్డకట్టే పరిస్థితులు .. చలి తీవ్రత పెరగడానికి కారణాలవేనా?
చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి

చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.భారత దేశంలో చలిగాలులు ఎక్కువగా వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మరికొద్ది రోజుల పాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. చలితీవ్రతతో పాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలను రద్దు చేసుకుని ఉదయం పది గంటల తర్వాత మాత్రమే రహదారులపైకి వస్తే పొగమంచు కారణంగా ప్రమాదాలు నివారించవచ్చని పేర్కొంది. చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుందని, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడే వారు, చిన్నారులు బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.
ఏపీ వ్యాప్తంగా ఒకే వాతావరణం...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం ఎనిమిది గంటల వరకూ పొగమంచు వీడటం లేదు. రాత్రి వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతంలోనూ చలిగాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలో చలితీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అరకు, మినుములూరు, లంబసింగి వంటి ప్రాంతాల్లో ఆరు డిగ్రీల కంటే కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ చలితీవ్రతతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు పూర్తిగా మందగించాయని, గతంలో ఈ సీజన్ లో భారీగా ఆదాయం వచ్చేదని, ఈసారి చలితీవ్రతతో వ్యాపారాలు నడవటం లేదని వాపోతున్నారు.
రోజురోజుకూ పెరుగుతూ...
తెలంగాణలోనూ చలితీవ్రత మరింత ఎక్కువవుతుంది. రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడి పోతున్నారు. రోజు వారి పనులకోసం వెళ్లే కార్మికులు కూడా చలితీవ్రతో పనులకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తుంది. దీంతో వారి రోజు వారి భత్యం తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సాధారణంకంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా వణుకు ప్రజలను భయపెడుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Next Story

