Sat Jan 31 2026 21:14:13 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : బీఆర్ఎస్ ఓట్లను బీజీపీకి బదిలీ చేసింది
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చరిత్రలో బీఆర్ఎస్ కు పార్లమెంటు లో స్థానం లేకుండా పోయిందన్నారు. అనేకచోట్ల బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి బదిలీచేసిందని చెప్పారు. మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని హరీశ్ రావు నమ్మించి మోసం చేశాడని, లోపాయికారీగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతు తెలిపారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. మెదక్ లో బీఆర్ఎస్ ఓట్లన్నింటినీ బీజేపీకి బదిలీ చేసి కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు.
ఓట్ల శాతం పెంచుకున్నాం...
ఈసారి కాంగ్రెస్ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో గెలిచిందన్నారు. కంటోన్మెంట్ శాసనసభ స్థానాన్ని కూడా దక్కించుకుని తమ అంకెను శాసనసభలో పెంచుకున్నామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉండి ప్రజలను అవమానించిందని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓట్ల శాతం పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే దేశంలో ఇండియా కూటమి ఇంతటి విజయాన్ని సాధించిందన్నారు. పూర్తి స్థాయి మెజారిటీ రాని నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఫలితం వచ్చినా అందుకు బాధ్యత తనదేనని అన్నారు.
Next Story

