Thu Feb 13 2025 02:36:17 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : సంక్రాంతికి రైతు భరోసా నిధులు.. మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్
సంక్రాంతి తర్వాతరైతు భరోసా ఖాతాల్లో పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

సంక్రాంతి తర్వాతరైతు భరోసా ఖాతాల్లో పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సన్నాలను చివరి గింజ వరకూ కొంటామని, ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ సన్న బియ్యాన్ని రేషన్ బియ్యంగా అందిస్తామని అన్నారు. హాస్టల్ లో బిడ్డలకు అది బువ్వగా మారుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మూసీనదిని ప్రక్షాళన చేస్తామని తెలిపారు. మూసీ కట్టితీరతామని చెప్పారు. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతానని అన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడం ఖాయమని ప్రకటించారు. మూసీ వద్దని అడ్డం పడేటోళ్లకు గోరీ కట్టాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. మూసీ కట్టాలా? వద్దా? అని నల్లగొండ ప్రజలు నిర్ణయించాలన్నారు. మూసీని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత డబ్బులు ఖర్చయినా తాను ప్రక్షాళన చేస్తానని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో...
నల్లగొండలో జరిగిన మెడికల్ కళాశాల భవనం ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. నల్లగొండ జిల్లా అంటే ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్ అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ జిల్లాలో పోషించిన పాత్ర కీలకమైనదని రేవంత్ రెడ్డి కొనియాడారు. రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన జిల్లా నల్లగొండ అని ప్రశంసించారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా నల్లగొండ జిల్లా అభివృద్ధికి పదేళ్ల పాటు నోచుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే పదేళ్ల కేసీఆర్ పాలనలోనే నల్లగొండకు అన్యాయం జరిగిందన్న రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పూర్తి చేసి ఉంటే నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమయ్యేదని అన్నారు.
ఓడిపోయినంత మాత్రాన...
కేసీఆర్ తన అనుభవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవడం తగ్గదని రేవంత్ రెడ్డి అన్నారు. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉండాలని రేవంత్ రెడ్డి కోరారు. కేసీఆర్ ఎప్పుడైనా ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పన్నెండు వందల మంది ఆత్మబలిదానం చేసుకుంది మీ కుటుంబంలోని నలుగురికి ఉద్యోగాలు కోసం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గాలి బ్యాచ్ ను వదిలి విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినన్ని ఉద్యోగాలు దేశంలో బీజేపీ పాలిత ప్రాంతంలో ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. శాసనసభలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిది కాదని ఆయన అన్నారు.
ఇచ్చిన గ్యారంటీలను...
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీకట్టడానికే సరిపోతుందన్నారు. అయినా సరే.. సంక్షేమపథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఏడాదిలోనే అమలు చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, రైతులకు రెండు లక్షల రుణమాఫీలను అమలు చేశామన్నారు. గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నామని చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తూ పోస్టులను భర్తీ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నల్లగొం డ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పాలి.
Next Story