Revanth Reddy : బట్టలు ఊడతీస్తా..తోలుతీస్తా అన్నవాళ్లు ఎటు పోయారు?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. కృష్ణానదీ జలాలపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. వలస ప్రాంతమైన పాలమూరు నుంచి రాజకీయంగా ఎదిగి ఇక్కడకు వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తనతో పాటు అక్కడ ఉన్న నేతలందరికీ పాలమూరు రైతుల దయనీయమైన స్థితి అందరికీ తెలుసునని చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి ప్రతిపక్ష నేత పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తనపైనా, తన ప్రభుత్వంపైనా విమర్శలు చేశారన్నారు. కేసీఆర్ నలభైఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారని, అపారమైన అనుభవం ఉందని అనుకున్నామని, వారి సూచనలు ప్రభుత్వానికి ఇస్తారేమోనని భావిస్తే ఆయన సభకు కూడా రాకుండా వెళ్లిపోయారని రేవంత్ రెడ్డి అన్నారు.కృష్ణా నదీజలాలకు సంబంధించి ఒకరోజు, గోదావరి జలాలకు సంబంధించి ఒకరోజు సభలో చర్చిద్దామనుకున్నా ఆయనతో పాటు ఆయన పార్టీ సభ్యులు కూడా సభకు రాకుండా పోయారని రేవంత్ రెడ్డి అన్నారు.

