Sat Dec 13 2025 22:30:55 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఒక్కడి నిర్లక్ష్యం...ఎందరిని బలితీసుకుంది?
తెలంగాణలోని చెవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది

తెలంగాణలోని చెవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ గ్రామం వద్ద కంకరతో నిండిన లారీ, తాండూరు డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ, ఆమె పది నెలల కుమార్తెతో పాటు ఇరవై మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ బస్సు ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
టన్నుల కొద్దీ కంకర...
టన్నుల కొద్దీ కంకర బస్సుపై పడిపోవడంతో అనేక మంది ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న వెంటనే చెవెళ్ల పోలీసులు, రక్షణ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. మూడు జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించి చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. దాదాపు యాభై నుంచి అరవై టన్నుల కంకర ఉండటంతో అది మొత్తం ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక చనిపోయారు. ప్రమాద తీవ్రతను బట్టి టిప్పర్ అత్యంత వేగంగా వస్తుందని అధికారులు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.
నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా?
షాద్ నగర్ నుంచి తాండూరుకు ఈ టిప్పర్ కంకర లోడుతో వస్తుంది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్, శిశువుతో పాటు పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 72 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు మిర్జాపూర్ వంకలోని మలుపు వద్దకు రాగానే టిప్పర్ వేగం అదుపు తప్పి బస్సును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ పడటంతో అందులో ఉన్న కంకర మొత్తం బస్సుపై పడింది. ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్ తో టిప్పర్ వస్తుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story

