Fri Dec 05 2025 09:14:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు సంచలన నిర్ణయం
తెలంగాణ టీడీపీ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో సమావేశం కానున్నారు.

తెలంగాణ టీడీపీ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో సమావేశం కానున్నారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన చర్చ ప్రధానంగా ఉంటుందని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.
పోటీకి దూరంగానే...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం మాత్రం కనిపించడం లేదు. మాగంటి గోపీనాధ్ కుటుంబంతో ఉన్న సత్సంబంధాల కారణంగా, మరొకవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉండటం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుడటంతో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి తెలంగాణలో బీజేపీకి శత్రువుగా వ్యవహరించే అవకాశం లేదంటున్నారు. అయితే నేతలు మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాత్రం పోటీ చేయాల్సిందేనంటూ కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు ముందు తమ వాదనలను వినిపించే అవకాశముంది.
బీజేపీ అభ్యర్థిగానే...
గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీపై పూర్తిగా దృష్టి పెట్టలేదు. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నియమించలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోనే సతమతమవుతున్న చంద్రబాబుకు తెలంగాణ పార్టీని పట్టించుకునే సమయం కూడా లేదు. ఈ సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దింపి అనవసర సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకని సహజంగా చంద్రబాబు ఆలోచించే అవకాశముందని చెబుతున్నారు. ఏ మాత్రం ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ చంద్రబాబు ఆగరని, షెడ్యూల్ విడుదలయిన తర్వాత టీటీడీపీ నేతలను పిలిచి మాట్లాడుతున్నారంటే అది బీజేపీతో కలసి పనిచేసి, ఆ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరనున్నారు. ఈ మేరకు టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

