Thu Jul 17 2025 00:22:25 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ ఆ మాట ఎందుకన్నట్లు.. ఉప్పందిందా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కారు కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట హాజరయ్యారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కారు కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే అంతకు ముందు తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ ఈరోజు తనను అరెస్ట్ చేసే అవకాశముందని అనడంతో పెద్దయెత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చాయి. బంజారాహిల్స్ లోని నీలోఫర్ కేఫ్ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కమాండ్ కంట్రోల్ రూంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లిపోవాని పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. అయితే వారు వెళ్లకపోవడంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ A 1 నిందితడిగా ఉండటంతో ఈరోజు అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
న్యాయవాదులతో సమావేశం...
ఏసీబీ కార్యాలయానికి వచ్చే ముందు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. న్యాయవాదులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు పోలీసు బందోబస్తు కూడా పెంచడంతో పాటు నీలోఫర్ కేఫ్ ను మూడు గంటల పాటు మూసివేయాలని పోలీసులు ఆదేశించడంతో కేటీఆర్ ను ఈ రోజు అదుపులోకి తీసుకునే అవకాశముందన్న ప్రచారం ఊపందుకుుంది. అందువల్లనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఏసీబీ కార్యాలయానికి తన న్యాయవాదితో చేరుకున్న కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జనవరిలో ఒకసారి ఈ కేసులో విచారించి మరొక సారి విచారణకు పిలవడంతోనే ఈరకమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో...
అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళదామనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ అరెస్ట్ వంటి చర్యలకు దిగబోదన్నఅభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రులు పదే పదే చెబుతుండటంతో ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం లేదని అంటున్నారు. మరొకసారి విచారణకు పిలిచే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ వస్తున్న వార్తలు ఒకవైపు వస్తుండటంతో పెద్దయెత్తున కార్యకర్తలు తరలి వస్తుండటంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. మొత్తం మీద ఏసీబీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
Next Story