Tue Jan 13 2026 14:45:57 GMT+0000 (Coordinated Universal Time)
KTR : ఫెయిల్యూర్ ముద్ర చెరిపేసుకోవాలనుకుంటున్న కేటీఆర్ గేమ్ మొదలెట్టారా?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే విధంగా ఫలితాలు ఉండాలని భావిస్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు తమకు సానుకూలంగా ఫలితాలువస్తాయన్న ఫుల్లు కాన్ఫిడెన్స్ తో గులాబీ పార్టీ ఉంది. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమేనని భరోసా ఇస్తున్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో పాటు ఈవీఎంలు కావడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ప్రజల నుంచి వెలువడుతుందన్న భావనలో కారు పార్టీ నేతలున్నారు. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
అన్ని మున్సిపాలిటీల్లో...
ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అన్ని మున్సిపాలిటీల్లో వార్డు సభ్యులుగా తమ పార్టీ వారిని ఎంపిక చేసి జాబితాను సిద్ధం చేసి పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టిక్కెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. అందుకే ముఖ్య కార్యకర్తలు, ఈ రెండేళ్ల పాటు జెండాను వదలకుండాట్టుకుని ఉన్నవాళ్లని ఎంపిక చేయాలని స్థానిక నియోజకవర్గ ఇన్ ఛార్జులకు ఇప్పటికే సమాచారం పంపారు. ఈ మేరకు జాబితాను రూపొందించి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాలని, ఇక్కడి నుంచి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందన్న సిగ్నల్స్ కూడా హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు వెళ్లాయి.
పార్టీ గుర్తులుండటంతో...
పట్టణ ఓటర్లు కావడంతో కేవలం డబ్బుకు ప్రలోభపడటమే కాకుండా ఆలోచించి, ప్రభుత్వ పనితీరును కూడా అంచనా వేసి ఓట్లు వేస్తారు కాబట్టి బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎక్కువ స్థానాల్లో ఎగురవేయాలని భావిస్తున్నారు. మరొకవైపు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన తర్వాత జరుగుతున్న వరస ఉపఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు,పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో ఈ ఎన్నికల్లో తన నాయకత్వం అంటే ఏంటో చూపాలని కేటీఆర్ భావిస్తున్నారు. తనపై పడిన ఫెయిల్యూర్ ముద్రను చెరిపేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అందుకోసం పార్టీ నేతలతో పాటు శ్రేణులను కూడా మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. మొత్తం మీద మున్సిపల్ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు గులాబీ పార్టీ నాయకత్వంలో మాత్రం భారీ ఆశలే ఉన్నట్లున్నాయి.
Next Story

