Fri Dec 05 2025 09:59:23 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్.. చర్యలకు దిగుతారా?
కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీనిపై నేతలతో సమావేశమయ్యారు.

కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ పై బాణం ఎక్కుపెట్టారు. అయితే ఈసారి నేరుగా పేర్లు బయటపెడుతూ విమర్శలు చేయడంతో పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడినట్లయింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈసారి నేరుగా హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని ఆమె మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు నేతలు కలసి కేసీఆర్ పై కుట్రలకు పాల్పడ్డారని కల్వకుంట్ల కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోష్ రావుది కీలక పాత్ర అని ఆమె చెప్పారు. వీరిద్దరి వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, వారిని కాపాడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు.
కేసీఆర్ ను బలిపశువును చేసి...
తాను ఇప్పుడు మాట్లాడితే తన వెనక ఎవరో ఉన్నారంటారని, కానీ ఆ అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువుగా మారారని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నదీ వారేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యుడిని చేస్తూ కేసీఆర్ పై సీబీఐ విచారణ చేసిందని, తన కడుపు మండిపోతుందని ఆమె ఆవేదన చెందారు. తన తండ్రికి డబ్బు, తిండిపై ఏనాడూ ఆశ లేదని, కేసీఆర్ పరువు పోతే ఆ బాధ తమకు ఉంటుందని చెప్పుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర అని అన్నారు. అందుకే నాడు హరీశ్ రావు ను నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా తొలగించారని చెప్పారు. తనను అడ్డుకుంటే బిడ్డా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో...
హరీశ్ రావు, సంతోష్ రావు వల్లే తమ పార్టీ అధినేత కేసీఆర్ కు ఈ పరిస్థితి దాపురించిందని ఆమె ఆవేదన చెందారు. కేసీఆర్ ను అడ్డంపెట్టుకుని వీళ్లిద్దరూ భారీగా ఆస్తులు కూడబెట్టారన్న కవిత, వారిద్దరికీ డబ్బులు మాత్రమే కావాలని ఆవేదన చెందారు. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఎక్స్ లో స్పందించింది. హరీశ్‌రావును ఆరడుగుల బుల్లెట్ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పేర్కొంది. కవిత కామెంట్స్ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్ తో పాటు మధుసూదనాచారి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ తో సమావేశమై కవిత వ్యాఖ్యలపై చర్చిస్తున్నారు. కవితపై ఇక చర్యలకు దిగే అవకాశముందని తెలిసింది.
Next Story

