Fri Dec 05 2025 12:48:00 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవిత సస్పెన్షన్.. బహిష్కరణ కాదు.. ఎప్పుడైనా ఎంట్రీ ఇవ్వొచ్చు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కవిత రేపు పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కవిత రేపు పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. కల్వకుంట్ల కవిత కారు పార్టీని రాజకీయంగా పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిలో హరీశ్ రావు, సంతోష్ రావు ప్రమేయం ఉందని, తన తండ్రి నిర్దోషి అని చెప్పేందుకు కవిత ప్రయత్నం చేశారు. అయితే కల్వకుంట్ల కవిత కేసీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ చేయకపోయినా ఆయనకే సూటిగా ఈ విమర్శలు తాకే అవకాశముంది. అది చిన్న పిల్లవాడికైనా అర్థమవుతుంది. కేసీఆర్ ప్రమేయం లేకుండా హరీశ్ రావు, సంతోష్ రావులు అవినీతికి పాల్పడి, వేల కోట్లు సంపాదించుకున్నారని, అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటే నమ్మేవారు ఎవరూ లేరు. ఎందుకంటే గతపదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కు తెలియకుండా ఏమీ జరగదన్న విషయం అందరికీ తెలుసు.
కాళేశ్వరం వివాదంలోకి...
కల్వకుంట్ల కవిత మాత్రం తన తండ్రి మంచోడని, వాళ్లిద్దరే విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి కేసీఆర్ ను కూడా ఈ వివాదంలోకి లాగేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీని ఖచ్చితంగా ఇబ్బందుల్లోకి పడేస్తాయనే చెప్పాలి. పార్టీ నేతగా మాత్రమే కాదు.. కేసీఆర్ కుమార్తెగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు జనంలోకి నేరుగా వెళతాయి. అసెంబ్లీ సమావేశాల్లో హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని కవిత దానిపై నీళ్లు కుమ్మరించినట్లయింది. ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఖచ్చితంగా నమ్ముతుంది. అది కేసీఆర్ చేశారా? హరీశ్ రావు చేశారా. సంతోష్ రావు చేశారా? అన్నది పక్కన పెట్టి బీఆర్ఎస్ చేసిందన్నది మాత్రం అందరికీ అర్థమయింది. అందువల్లనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఏతావాతా నష్టపోయేది...
ఇన్నాళ్లూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు రాజకీయపరమైనవిగా జనానికి చెప్పుకునే ఛాన్స్ ఇప్పుడు కారు పార్టీ కోల్పోయిందనే చెప్పాలి. కవిత తన వ్యక్తిగత కక్షలతో పార్టీని రాజకీయ ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. కవిత ఏం ఆశించి... ఎందుకు ఆగ్రహించి ఈ విమర్శలు చేసినా ఏతావాతా నష్టపోయేది పార్టీ మాత్రమే. అది అందరికీ తెలుసు. కవితపై ఒకవేళ పార్టీ చర్య తీసుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సి నష్టం పార్టీకి దారుణంగా జరిగిపోయింది. గత కొన్నాళ్లుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందిపెడుతున్న కాళేశ్వరం పై చేసిన కామెంట్స్ తో ఇక కోలుకోలేని దెబ్బతీసిందని గులాబీ పార్టీ కార్యకర్తలే వాపోతున్నారు. కవిత వరసగా తన కుటంబ సభ్యులను, కేసీఆర్ చుట్టూ ఉన్న వారిని టార్గెట్ చేయడంతో ఆ అపప్రధ పెద్దాయనకు కూడా చుట్టుకుని పార్టీకి భవిష్యత్ లేకుండా కవిత చేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినపడుతుంది.
సస్పెన్షన్ వేటుతో...
కల్వకుంట్ల కవితపై సస్పెన్షన్ వేటు వేయడం అంటే బహిష్కరణ కాదు. పార్టీ నుంచి పూర్తిగా బయటకు పంపలేదు. తిరిగి కల్వకుంట్ల కవిత నేతలతో సయోధ్య కుదుర్చుకుని పార్టీలోకి వస్తానంటే తీసుకునేందుకు వీలుగా కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. గతంలో టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గా మారిన తర్వాత సస్పెన్షన్ అనే మాట వినిపించలేదు. అందరినీ బహిష్కరించడమే. ఆలె నరేందర్, విజయశాంతి, ఈటల రాజేందర్ వరకూ అందరూ బహిష్కరణకు గురయిన వారే. అయితే పేగు బంధం కవితపై బహిష్కరణ వేటు పడకుండా సస్పెన్షన్ వేటుతోనే సరిపెట్టింది. అంటే కల్వకుంట్ల కవిత మళ్లీ కారు పార్టీలోకి రారన్న గ్యారంటీ అంటూ ఏమీ లేదు. తాత్కాలికంగా పార్టీలో తలెత్తుతున్న సంక్షోభాన్ని రూపుమాపడానికే కల్వకుంట్ల కవితప సస్సెన్షన్ తో సరిపెట్టారన్న కామెంట్స్ అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్నయి.
Next Story

