Fri Dec 05 2025 10:24:44 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ అందుకే బయటకు రావడం లేదట...అధికారం దక్కాలంటే?
ప్రజలు మార్పు కోరుకుంటేనే అధికారంలోకి వస్తామని మాత్రమే బీఆర్ఎస్ నేత కేసీఆర్ బలంగా నమ్ముతున్నట్లుంది.

ప్రజలు మార్పు కోరుకుంటేనే అధికారంలోకి వస్తామని మాత్రమే బీఆర్ఎస్ నేత కేసీఆర్ బలంగా నమ్ముతున్నట్లుంది. అందుకే దాదాపు పదిహేడు నెలల నుంచి ఆయన ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. జనంలోకి పెద్దగా వచ్చేందుకు ఆయన ఇష్టపడటం లేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంతగా తిరిగినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు తనను విశ్వసించలేదన్న భావనతో కేసీఆర్ ఉన్నారనిపిస్తుంది. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసీటును కూడా గెలుచుకోలేకపోయామని భావించిన కేసీఆర్ జనంలోకి రావడం తొందరపడినట్లే అవుతుందని ఫిక్స్ అయిపోతున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఆయన ఫాం హౌస్ ను వదిలి బయటకు రావడం లేదు.
పని ఉంటే మాత్రం...
ఏదైనా పని ఉంటే నేతలను మాత్రమే తన వద్దకు రప్పించుకుంటున్నారు కానీ ఆయన కనీసం హైదరాబాద్ కు కూడా రావడం లేదు. ఏదైనా మెడికల్ చెకప్ లకు మాత్రమే అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చి వెళుతున్నారు తప్పించి ఫాం హౌస్ లో ఉంటూ వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమయ్యారు. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ వీలు చిక్కినప్పుడల్లా ఫాం హౌస్ కి వెళ్లి గడిపి వచ్చే వారు. అలాంటిది పార్టీ 2023 ఎన్నికలలో ఓటమి తర్వాత ఇక తెలంగాణలో సమస్యల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో నల్లగొండ జిల్లాకు వచ్చి రైతుల సమస్యలపై గళం విప్పి వెళ్లడం మినహాయించి పెద్దగా ఆయన బయటకు వచ్చింది లేదు.
అసెంబ్లీ సమావేశాలకు...
ఇక అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన రావడం మానుకున్నారు. హాజరు వేయించుకోవాలని గవర్నర్ ప్రసంగం రోజు తప్పించి మిగిలిన రోజులు మళ్లీ షరా మామూలే. అసెంబ్లీలోనూ కేటీఆర్, హరీశ్ రావులు మాత్రమే బీఆర్ఎస్ తరుపున మాట్లాడుతున్నారు. ప్రజాసమస్యలను లేవనెత్తుతున్నారు. కేసీఆర్ మాత్రం ప్రజలు తన విలువ తెలుసుకోవాలని భావిస్తున్నట్లుంది. తాను ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిందీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుని మరీ వారి మనసుల్లో మార్పు రావాలని, మనం ఎంతగా విమర్శలు చేసినా అవి గాలికి పోతాయి తప్పించి ప్రజలు పట్టించుకోరని కేసీఆర్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే సుదీర్ఘకాలం పార్టీ ఇన్నర్ మీటింగ్ లు తప్ప బయటకు మాత్రం కేసీఆర్ రావడం లేదంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులే...
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులే తనకు మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడతాయని కేసీఆర్ భావిస్తున్నారు. అంతే తప్ప మనం గొంతు చించుకుని, ఎండనకా, వాననకా జనంలో తిరిగినా ఫలితం ఉండదని ఆయన తన అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. తాము ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి గత ఎన్నికల్లో ప్రజలు ఓటేశారని, తిరిగి అదే ప్రజలు తనను గెలిపించి తీరతారన్న నమ్మకంతో గులాబీ బాస్ ఉన్నారు. ఇప్పటి నుంచేవ్యయ ప్రయాసలకోర్చి జనంలోకి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదని, కాంగ్రెస్ ను చేయాల్సిన తప్పులన్నీ చేయించేంత వరకూ వేచి ఉండటమే మంచిదని కేసీఆర్ నేతలతో అన్నట్లు తెలిసింది. మొత్తం మీద కేసీఆర్ ఇప్పట్లో జనంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నెలలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు హాజరై తిరిగి ఫామ్ హౌస్ కే పరిమితం కానున్నారు.
Next Story

