BRS : కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేసీఆర్.. దాన్ని నమ్ముకుంటే?
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించారు. తొలుత పహాల్గాం ఘటనపై మరణించిన వారికి సభలో సంతాపాన్ని ప్రకటించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో చేరుకున్న కేసీఆర్ తొలుత పార్టీ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఆయన ఏడు గంటల ప్రాంతంలో సభా వేదికపైకి చేరుకున్నారు. ఇరవైఐదేళ్ల నాడు ఎగిరిన గులాబీ జెండాను ఎందరో అవహేళన చేశారని, అవమానించారని, ఈ జెండా ప్రజల సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోగలిగామని తెలిపారు. తర్వాత ప్రజలు దీవిస్తే అద్భుతమైన తెలంగాణణు పదేళ్ల పాటు ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. వరంగల్ గడ్డకు ప్రత్యేక ఉందని, పోరు గడ్డ అని అందుకే ఈ నేలకు వందనం చేస్తున్నానని కేసీఆర్ తెలిపారు. విధ్వంసమైన తెలంగాణను అభివృద్ధి పథంలో నడపగలిగామని కేసీఆర్ చెప్పారు. పదవుల కోసమో.. అధికారం కోసమో.. పుట్టలేదు ఈ తెలంగాణ జెండా అని రాష్ట్రం కోసమే పుట్టిందని అన్నారు. తాను ఉద్యమ జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపండని మిమ్మల్ని తాను కోరిన విషయాన్ని ఆయన గుర్తుకు తెచ్చారు..

