Fri Dec 05 2025 11:15:46 GMT+0000 (Coordinated Universal Time)
Raja Singh : మీకో దండం.. మీ పార్టీకో దండం... మీరు మామూలోళ్లు కాదు సామీ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు.రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు తనను పార్టీ పదవికి నామినేషన్ వేయనివ్వలేదని ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. తాను పార్టీ కోసం సర్వస్వం ధార పోశానని, అయినా తనను అణగదొక్కేందుకు కొందరు పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి పోరాడుతున్నానని, అధికారంలోకి రాకూడదని ఎక్కువ మంది కోరుకుంటున్నట్లుందని రాజాసింగ్ తెలిపారు. వాళ్లు అనుకున్న వాళ్లకే అధ్యక్షపదవి ఇచ్చారని, తనను నామినేషన్ వేయడానికి కూడా అంగీకరించకపోవడానికి కారణాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మూడు సార్లు గెలిచి...
రాజాసింగ్ మూడు సార్లు గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు.ఆయన గత కొంతకాలంగా పార్టీ లోని రాష్ట్ర నాయకుల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల కొందరు నేతలపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అధినాయకత్వం కూడా వారికే వత్తాసు పలుకుతుందని తెలుసుకునితాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని, కిషన్ రెడ్డి తనను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ కు లేఖ రాయాలని రాజాసింగ్ కోరారు. 2014 నుంచి తాను పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చాలా రోజుల తర్వాత వచ్చిన ఆయన నామినేషన్ వేయగడా అందుకు నేతలు అంగీకరించలేదు.
ఎన్నిక జరగాలంటూ...
ముందుగానే రాష్ట్ర అధ్యక్షుడి పేరును నిర్ణయించుకుని నావాడు - నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే ఇక ఎన్నిక ఎందుకు? అని రాజాసింగ్ ప్రశ్నించారు. బీజేపీ నుంచి ఎనిమిది మంది శాసనసభ్యులు, ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు గెలవడానికి బూత్ లెవెల్ కమిటీ కార్యకర్తలే కారణమని, అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సింది వారేనని, నేతలు కాదని రాజా సింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసినా పట్టించుకోలేదన్నారు. 2014 నుంచి తాను పార్టీలో ఇబ్బందులు పడతున్నానని రాజా సింగ్ చెప్పారు. కాగా రాజాసింగ్ రాజీనామాపై పార్టీ నేతలు ఎవరూ స్పందించకపోవడం కొసమెరుపు. ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగే అవకాశముంది.
Next Story

