Fri Dec 05 2025 16:05:46 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరికీ షాకిచ్చిన కేంద్ర సర్కార్
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. 2030 తర్వాతనే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 2030 తర్వాతనే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. అంటే మరో రెండు ఎన్నికలు జరిగిన తర్వాతనే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతనే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
మరో రెండు ఎన్నికలు..
ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాల నుంచి 225, తెలంగాణలో 119 సీట్ల నుంచి 153 స్థానాలకు పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే పెంచాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అంటే 2031 వరకూ జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతూ ఉంటుందని, అందుకే 2024 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని తెలిపారు. అంటే మరో మూడు ఎన్నికల వరకూ నియోజకవర్గాల పెంపుదల ఉండకపోవచ్చన్నది నిత్యానందరాయ్ మాటలను బట్టి స్పష్టమవుతుంది. ఇది ఒకరకంగా అధికారంలో ఉన్న కేసీఆర్, జగన్ లకు ఒకింత ఇబ్బందికరంగానే మారనుంది.
Next Story

