Fri Mar 21 2025 06:50:15 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మరో హామీని గ్రౌండ్ చేయడానికి రేవంత్ రెడీ అయ్యారటగా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో హామీలను గ్రౌండ్ చేసేందుకు రెడీ అయింది

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో హామీలను గ్రౌండ్ చేసేందుకు రెడీ అయింది. ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు మరో హామీని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అదే మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్స ప్రయాణాన్ని అమలు చేసింది. అలాగే గృహాలకు వినియోగించే సిలిండర్ ను ఐదు వందల రూపాయలకే ఇచ్చే హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది.
అనేక హామీలను...
దీంతో పాటు గృహ జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందచేస్తుంది. చాలా మందికి జీరో బిల్లులు వస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతుల విషయంలో ఇప్పటికే రెండు లక్షల రూపాయల మేర రుణమాఫీని అమలు చేసింది. అయితే దీనిపై కొందరికే చేశారన్న విమర్శలున్నా చాలా మందికి ఈ పథకం అందిందని చెబుతున్నారు. అలాగే రైతు భరోసా కింద నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం గత నెల 26వ తేదీ నుంచి ప్రారంభించింది. ఈ ప్రక్రియ మార్చి వరకూ కొనసాగుతుందని తెలిపింది. విడతల వారీగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపింది. దీంతో పాటు వ్యవసాయ కార్మిక కుటుంబాలకు కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది.
వారికి మాత్రమే...
అలాగే పేదలకు ఇళ్లను కేటాయించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కూడా ప్రారంభించింది. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. నియోజకవర్గాలనికి 3,700 ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద నెలకు మహిళలకు రెండు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా త్వరగా ఇచ్చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారికి మాత్రమే ఈ పథకాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఈ పథకం గ్రౌండ్ చేయాలంటే కొంత ఆర్థిక భారమయినా వచ్చే ఏ ఎన్నికల్లో గెలవాలన్నా ఈ పథకం తమకు ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే త్వరలో దీనిపై కీలక అప్ డేట్ వచ్చే అవకాశముందని తెలిసింది.
Next Story