Fri Dec 05 2025 13:38:14 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కారును సరైన దారిలో నడిపించేదెవరు.. కేసీఆర్ పూనుకోరా?
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ ను కుటుంబ కలహాలు కిందకు దిగజారుస్తున్నాాయా?

బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకుని రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వరసగా రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే పార్టీలోని అగ్రనేత ఇంట్లోనే ప్రత్యర్థులు బయలుదేరడం ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. వైసీపీ అధినేత జగన్ పరిస్థితి వేరు. ఆయన తన తండ్రి మరణం తర్వాత సొంతంగా వైసీపీని పెట్టుకున్నారు. అప్పటి వరకూ కలసిమెలసిన అన్నా చెల్లెళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరుపడ్డారు. రాజకీయంగా విభేదాలు బయటపడ్డాయి. కానీ బీఆర్ఎస్ పరిస్థితి వేరు. నాటి టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కాగానే ఇక్కడ అన్నా చెల్లెళ్లకు పడటం లేదు.
ఇంటి సమస్యలను పరిష్కరించుకోవాలని...
ఇది ఇప్పుడు అధికార పక్షానికి వరంగా మారింది. తెలంగాణలో ఏ సమస్యపైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమం చేయాలని భావించినా ముందు ఇంటి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇది గులాబీ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. సొంత చెల్లెలు విమర్శలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ ఫ్రస్టేషన్ లో తమపై లేని పోని నిందలు వేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. ముందు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలోనూ తన ఫోన్ తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్అయి ఉంటాయని కవిత చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి.
కాంగ్రెస్ పై కాలుదువ్వుతుంటే...
కాంగ్రెస్ పై కాలుదువ్వుతూ ముందుకు వెళదామని అనుకుంటే.. కవిత రూపంలో కాళ్లకు అడ్డంపడుతుదని అంటున్నారు. కల్వకుంట్ల కవిత తన సోదరుడితో రాజకీయంగా దూరమయ్యారు. ఆమె కనీసం తెలంగాణ భవన్ కు కూడా రావడం లేదు. అలాగే కేటీఆర్ కూడా కవిత పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తున్నారని, ఆమె జాగృతి తరుపున చేసే కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ వెళ్లవెద్దని ఆంక్షలు పెడుతున్నారని కవిత సన్నిహితులు ఆరోపిస్తున్నారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని, మరొకరి లీడర్ షిప్ తనకు అవసరం లేదని కవిత తెగేసి చెబుతున్నారు. కవిత, కేటీఆర్ ఉప్పునిప్పులా మారడంతో పాటు పార్టీతో పాటు ఇతర కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ జోక్యం చేసుకోరా?
బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపిందుకు కుట్ర జరుగుతుందని, దానిని తాను అడ్డుకున్నానని గతంలో కవిత రాసిన లేఖ సంచలనమే అయింది. తాజాగా సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా కవితకు ప్లస్ గా మారాయి. తాను చెప్పిందేనిజమని ఆమె సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ బయటకు చెప్పకపోయినా కవిత పట్ల ఇప్పుడు కఠినంగా వ్యవహరించకుంటే భవిష్యత్ లో కష్టమేనని భావించి రానున్న కాలంలో పార్టీ పదవుల విషయంలో తన వర్గం వారికే ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ కూడా ఇద్దరి మధ్య సయోధ్యకు పెద్దగా ప్రయత్నించకపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. కుటుంబ పెద్దగా ఇద్దరినీ కూర్చోబెట్టి ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలను తొలగించే ప్రయత్నం చేయాలని పార్టీ నేతలతో పాటు క్యాడర్ కోరుకుంటున్నారు. ఇద్దరి మధ్య తాము నలిగిపోతున్నామని చెబుతున్నారు.
Next Story

