Fri Dec 05 2025 17:33:35 GMT+0000 (Coordinated Universal Time)
Warangal : వరంగల్ సభలో భారీ భోజన ఏర్పాట్లు.. నోరూరించే తెలంగాణ వంటకాలతో అంతా సిద్ధం
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు పది లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు పది లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఏ ఏ నియోజకవర్గాల నుంచి వచ్చే వారు ఏ రూట్లలో రావాల్సింది ముందుగా నిర్ణయించారు. వారికి నిర్దేశించిన రూట్లలోనే రావాలని కోరారు. ప్రత్యేకంగా తయారు చేసిన రూటు మ్యాప్ ప్రకారం నియోజకవర్గాల వారీగా అనుమతించనున్నారు. పది లక్షల మందిని కంట్రోల్ చేయాలంటే మామూలు విషయం కాదు. అందుకే ఏ నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తల బాధ్యత ఆ నియోజకవర్గ ఇన్ ఛార్జిని అప్పగించారు. వారే దగ్గరుండి అందరూ చూసుకోవాలి. వారిని భద్రంగా ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకోవాలి.
ప్రత్యేకంగా వెయ్యి ఎకరాల్లో...
తమ ప్రాంతంలో గులాబీ జెండాను ఎగురవేసి మరీ వరంగల్ కు బయలుదేరిన జనానికి అవసరమైన వాహనాలను నియోజకవర్గాల ఇన్ ఛార్జులు సమకూర్చారు. అంతటితో ఆగకుండా వాహనాల కోసమే ప్రత్యేకంగా వెయ్యి ఎకరాల కు పైగానే పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నేతలు పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. పార్కింగ్ కూడా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం వాహనాలు ప్రత్యేకంగా పార్క్ చేయాలని మైకుల్లో వారికి సూచిస్తున్నారు. వాహనాలు ఎండ వేడిమికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. వరంగల్ జిల్లా హనుమకొండలోని ఎల్కతుర్తికి దూరంగానే వాహనాలను పార్కింగ్ చేసి అక్కడి నుంచి సభాస్థలికి వెళ్లాల్సి ఉంటుంది.
మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లతో...
ప్రతి వాహనంలో మంచినీటి తో పాటు బిస్కెట్లు, పండ్లు, ఓఆర్ఎస్ పాకెట్లను ఉంచారు. ఎటు నుంచి వచ్చినా ఎక్కడకక్కడ భోజనాల ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వంటకాలతో అంతా సిద్ధం చేశారు. వారు వచ్చే సమయంలోనే భోజనం తిని సభాస్థలికి చేరుకోవాల్సి ఉంటుంది. వాహనంలో వచ్చిన వారంతా ఒకేచోట ఉండాలని, తప్పిపోయినా సెల్ సిగ్నల్స్ సభా ప్రాంగణంలో ఉండవని ముందుగానే నిర్వాహకులు తెలిపారు. మొత్తం 154 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. లక్షల సంఖ్యలో కుర్చీలు వేస్తున్నారు. వేదికపై ఉన్న వారంతా కనిపించేలా ఎక్కడకక్కడ ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించారు. దీంతో పాటు పన్నెండు వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. వాహనాలు మరమ్మతులకు గురయితే వెంటనే వాటిని తీసుకెళ్లేందుకు టోయింగ్ వాహనాలను కూడా సిద్ధం చేశారు. సభకు వచ్చే వారి కోసం పది లక్షల వాటర్ బాటిల్స్ తో పాటు పదిహేను లక్షల మజ్జిగ బాటల్స్ ను ఏర్పాటు చేశారు. అందరికీ ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారు.
Next Story

