Tue Dec 23 2025 08:25:29 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : గ్రామంలోకి చెప్పులు వేసుకుని వస్తే ఐదు వేలు జరిమానా
ఆదిలాబాద్ జిల్లాలో వింత ఆచారాన్ని గ్రామస్థులు పాటిస్తున్నారు

ఆదిలాబాద్ జిల్లాలో వింత ఆచారాన్ని గ్రామస్థులు పాటిస్తున్నారు. గ్రామంలోకి ఎవరైనా చెప్పులు వేసుకుని ప్రవేశిస్తే ఐదు వేల జరిమానా విధిస్తారు.పుష్యమాసం ఆచారాలను ఆదివాసీలు పాటిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్ముగూడ గ్రామంలో శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. పుష్యమాసం పవిత్ర కాలంలో గ్రామంలోకి ప్రవేశించే వారు తప్పనిసరిగా చెప్పులు విడిచిపెట్టి రావాలనే నిబంధన అమల్లో ఉంది. దీనిని అతిక్రమిస్తే ఐదు వేల జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.
పుష్యమాసం సందర్భంగా...
ఆ గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఈ నిబంధనను ప్రకటించారు. నెల రోజుల పాటు అమలయ్యే నిబంధనను ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. పుష్యమాసంలో ఆదివాసీలు కఠిన ఆచార సంప్రదాయాలను పాటిస్తుంటారు. స్థానికంగా ఆదివాసీలుగా పిలిచే గిరిజనులు మంగళవారం నుంచి జనవరి 22 వరకు పుష్యమాస పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర కాలంలో మద్యం సేవించరు, పొగ తాగరు, నేలపై నిద్రిస్తారు, చెప్పులు లేకుండా నడవడం సంప్రదాయంగా పాటిస్తారు. గ్రామంలోకి వచ్చే బయటి వారు గ్రామ సరిహద్దుల్లోనే తమ చెప్పులు విడిచిపెట్టి లోపలికి రావాలని స్పష్టం చేశారు. నిబంధనను ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.
Next Story

