Mon Jun 23 2025 02:28:16 GMT+0000 (Coordinated Universal Time)
Formula E Car Race Case : కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు సిద్ధం చేస్తుందా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ ను మరోసారి విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఫార్ములా ఈ కారు రేసును తెలంగాణలో ఏసీబీ అధికారులు గత ఎనిమిది నెలల నుంచి విచారణ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 19వ తేదీన ఫార్ములా ఈ కారు రేసులో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ కేసులో కీలకమైన ఐఏఎస్ అధికారి అరవిందకుమార్ తో పాటు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించింది. కేటీఆర్ ను కూడా విచారణ చేసింది. హెచ్ఎండీఏ నిధులను మంత్రివర్గం ఆమోదం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు తరలించారన్న ఆరోపణలపై కేసు నమోదయింది.
విదేశాల నుంచి వచ్చిన తర్వాత...
ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులను కూడా వర్చువల్ గా విచారించింది. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను విచారించి మరొకసారి విచారణకు రమ్మని పిలుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే నెలలు గడుస్తున్నా విచారణకు పిలవలేదు. కానీ ఇటీవల మే 26వ తేదీన మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారుల కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. మే 28వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే అప్పటికే కేటీఆర్ ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం యూకే, అమెరికా పర్యటనలు ఉండటంతో తాను విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత హాజరవుతానని చెప్పారు.
మరోసారి నోటీసులు...
ఇందుకు ఏసీబీ అధికారులు కూడా అంగీకరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాల నుంచి వచ్చి మూడు రోజులవుతుంది. అయితే ఇప్పటి వరకూ ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కారు రేసు కేసులో మరోసారి నోటీసులు ఇవ్వలేదు. కేటీఆర్ మాత్రం తాను ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మరో రెండు రోజుల్లో కేటీఆర్ ను విచారణకు మరోసారి పిలిచే అవకాశముందని తెలిసింది. హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించడంపై ఇప్పటికే ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దీంతోఏసీబీ అధికారులు విచారణకు సంబంధించి ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నాక కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలిసింది.
Next Story