Tue Feb 10 2026 14:26:11 GMT+0530 (India Standard Time)
Weather Report : భానుడి భగభగలు.. ఉక్కిరిబిక్కిరవుతున్న జనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది. భానుడి ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం ఏడు గంటల నుంచి ఎండల తీవ్రత మొదలవుతుంది. నిన్నటి మొన్నటి వరకూ చలితో వణికపోయిన ప్రజలు నేడు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటి వేళల్లో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉక్కపోత వాతావరణం నెలకొని ఉంది. అలాగే మండుతున్న ఎండలతో సేదతీరడానికి అప్పుడే ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఇక రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో ఇప్పటి నుంచే...
ఆంధ్రప్రదేశ్ లో చలి పూర్తిగా తగ్గింది. ఫిబ్రవరి రెండో వారం మొదలు లోనే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకూ వేడిగాలులతో పాటు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కావలి, బాపట్ల, ఒంగోలు, నరసాపురం ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి.కావలిలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు కోస్తాంధ్రలో సాధారణం ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని చెప్పారు. రాయలసీమలో మాత్రం రెండు నుంచి నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
ఉష్ణోగ్రతలు గరిష్టంగానే...
తెలంగాణలోనూ చలి తీవ్రత కనిపించకుండా పోయింది. వాతావరణం లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగానే నమోదవుతున్నాయి. అయితే ముప్ఫయి డిగ్రీల ఉష్ణోగ్రతలు దాదాపు ఎక్కవ ప్రాంతాల్లో నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొగమంచు మాత్రం అక్కడక్కడ కురుస్తుంది. కానీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో మాత్రం ఉక్కపోతతో కూడిన వేడి గాలులు వీస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి ఉంది. తెల్లవారు జామున మాత్రం కొంత చలి అనిపిస్తున్నా తర్వాత మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. శివరాత్రికి ముందే భానుడి ప్రతాపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మే నెలలో ఎలా ఉంటుందో?
Next Story

