Wed Mar 25 2026 11:22:17 GMT+0530 (India Standard Time)
Weather Report : దేవుడా.. మార్చి నుంచి బయటపడ్డాం.. ఏప్రిల్ నుంచి ఎలా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకూ మండే ఎండలు. కానీ ఒక్కసారి చల్లటి వాతావరణం. కొన్నిచోట్ల వానలు. మరికొన్నిచోట్ల పొడి వాతావరణం అయినప్పటికీ వేసవి తీవ్రత మాత్రం లేదు. మార్చి నెలాఖరు వరకూ ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతుండటంతో హమయ్య.. మార్చి నుంచి బయటపడ్డాం.. ఇక ఏప్రిల్ ను ఎలా దాటాలి? అన్న దానిపైనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంటున్నారు.
ఏపీలో మరో మూడు రోజులు వానలు...
ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలో పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనకాపల్లి,విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడిచింది.
తెలంగాణలో కనిష్టంగా...
తెలంగాణలోనూ కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గత కొన్ని రోజులుగా తేలికపాటి జల్లులతో పాటు మోస్తరు వానలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, పొలాలకు వెళ్లేవారు చెట్లకింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా వరి, మొక్క జొన్న, మిర్చి పంట రైతులు తమ ఉత్పత్తులను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, అకాల వానలతో పంట ఉత్పత్తులు పాడయి పోయే ప్రమాదం ఉందని తెలిపింది.
Next Story

