Sat Dec 13 2025 22:35:16 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : స్థానిక సమరానికి సై.. ఎవరికి అనుకూలం అంటే?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు వేళయింది

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు వేళయింది. వరసగా పంచాయతి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. జీహెచ్ఎంసీలో పై చేయి సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరించడమే కాకుండా వార్డుల సంఖ్య కూడా పెరగనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం లభించింది. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను హస్తగతం చేసుకునేందుకు అవసరమైన వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.
జీహెచ్ఎంసీని హస్తగతం చేసుకునేందుకు...
ఇక పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు వీలుగా కాంగ్రెస్ ఇప్పటికే అనేక వరాలు ప్రకటించింది. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీని ప్రారంభించింది. ప్రధానంగా మహిళల ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే తీసుకుందని చెప్పాలి. దీంతో పాటు అనేక జిల్లాలకు సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే లోకల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకుందని అనుకోవచ్చు.
బీఆర్ఎస్, బీజేపీ కూడా...
బీఆర్ఎస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన వరసగా ఇక నియోజకవర్గాల స్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రచారం చేసేందుకు ఇప్పటికే కేటీఆర్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.త్వరలోనే ఆయన టూర్ షెడ్యూల్ ను వెలువరించే అవకాశాలున్నాయి. బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈరోజు బీజేపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం నిర్వహించారు. లోకల్ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి వాటిపై రామచందర్ రావు నేతలతో చర్చించారు. మొత్తం మీద మరో మూడు నుంచి నాలుగు నెలలు తెలంగాణలో ఎన్నికల హీట్ ఉండనుంది.
Next Story

