Sat Dec 13 2025 22:35:54 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : వణుకుతున్న జనం..వామ్మో ఇదేమి చలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో చలిగాలులు కూడా విపరీతంగా పెరుగుతాయని అంటున్నారు. కనిష్ట డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ డిగ్రీలు రెండు రాష్ట్రాల్లో నమోదవుతుండటంతో చలికి ప్రజలు వణికిపోతున్నారు. బయటకు ఉదయం రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే కానీ సూర్యుడు రావడం లేదు. అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి చలి తీవ్రత మొదలయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్ నెలలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
ఏజెన్సీ ఏరియాలో...
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లో అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇక ఏజెన్సీ ఏరియాలో అయితే చెప్పాల్సిన పనిలేదు. చలి నుంచి కాపాడుకోవడానికి చలిమంటలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీ పురం మన్యం, తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళ రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పొగమంచు దుప్పటి కప్పేస్తుండటంతో వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా సాగాల్సి వస్తుంది.
చలిగాలుల తీవ్రత...
ఇక తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత గురించి చెప్పాల్సిన పనిలేదు. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఏజెన్సీ గ్రామాల్లో అయితే చలిపులి వణికిస్తుంది. సిర్పూర్ లోఅత్యంత కనిష్టంగా7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుందని అధికారులు తెలిపారు. ఇక రోజువారీ కార్యక్రమాలకు వెళ్లాలంటే బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్లాలన్నా విద్యార్థులు భయపడిపోతున్నారు. ఉదయం దుప్పట్లో నుంచి బయటకు రావాలంటేనే ఏడుపు లంకించుకుంటున్నారు. చలితీవ్రత పెరగడంతో దగ్గు, జ్వరం, గొంతు తడి ఆరిపోవడం, ఒళ్లునొప్పులు వంటివి వస్తున్నాయని, సీనియర్ సిటిజన్లలో ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
Next Story

