Sun Dec 14 2025 00:26:15 GMT+0000 (Coordinated Universal Time)
Panchayath Elections : పంచాయతీ ఎన్నికలు .. నామినేషన్ వేయాలంటే నిబంధనలివీ
తెలంగాణ జిల్లాల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది

తెలంగాణ జిల్లాల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ నెల 27వ తేదీ నుంచే తొలివిడత నామినేషన్లను స్వీకరించనున్నారు.డిసెంబర్ 11, 14, 17న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలీస్ చెక్‌పోస్టులతో గ్రామాల్లో హడావుడి మొదలయింది. రేపటి నుంచి నామినేషన్ల హడావిడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉండాలి. ఏ మాత్రం నిబంధనలను పాటించకపోయినా స్క్రూటినీలో నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి.
నామినేషన్ వేసే వ్యక్తి...
నామినేషన్ వేసే వ్యక్తి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అభ్యర్థి మరియు ప్రతిపాదకుడు సంతకం చేసిన నామినేషన్ ఉదయం 10.30 నుండి 5 గంటల లోపు సమర్పించాలి. ప్రతిపాదకుడు కచ్చితంగా సంబంధిత వార్డు ఓటర్ లిస్టులో నమోదుఅయి ఉండాలి. అభ్యర్థి ఆ గ్రామంలో ఓటరుగా నమోదు అయి ఉండాలి. అభ్యర్థి మరియు ప్రతిపాదకుడు ఇంటి టాక్స్ కట్టి గ్రామ పంచాయతీ నుండి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాలి. డిపాజిట్ రుసుము సర్పంచ్ అభ్యర్థికి రెండు వేల రూపాయలు, వార్డు అభ్యర్థికి ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది.
రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులు...
ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ ఇవ్వాలి లేదంటే నామినేషన్ ఫారం లోని పార్ట్ _III లో డిప్యూటీ తహసీల్దార్ సంతకం చేయించాలి. రిజర్వుడు కేటగిరి అభ్యర్థుల డిపాజిట్ రుసుము సర్పంచి అభ్యర్థికి వెయ్యి రూపాయలు వార్డు అభ్యర్థికి 250 రూపాయలు చెల్లించాలి. ఇద్దరు సాక్షుల స్వీయ ధృవీకరణ అన్ని గడులు పూరించి ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పే డిక్లరేషన్ పై సంతకం చేసి ఇవ్వాలి. అభ్యర్థి తన గుర్తింపు కార్డు కొరకు ఫోటోను సమర్పించాలి. స్క్రూటీని రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా హాజరు కావాలి. ఈ నిబంధనలను అన్నింటినీ ఖచ్చింగా పాటిస్తేనే ఎన్నికల్లో పోటీకి అర్హులవుతారు.
Next Story

