Sat Dec 13 2025 22:35:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీరి సారధ్యమేనా?
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టు నిలుపుకోవడం ఒక సవాల్ గా మారనుంది.

తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టు నిలుపుకోవడం ఒక సవాల్ గా మారనుంది. గతంలో మాదిరి అంత సులువు కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యూహాలకు ధీటుగా వెళ్లాలంటే కేటీఆర్ నాయకత్వం సరిపోదన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్. కేసీఆర్ ఇప్పటికీ ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఆయన వస్తారని కూడా ఆశించడం లేదు. అనారోగ్య కారణాలతో పాటు కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే లోకల్ ఎన్నికలను కూడా బావాబామ్మర్దులే ఎదుర్కొనాల్సి ఉంటుంది. పార్టీ క్యాడర్ తో పాటు అభ్యర్థుల ఎంపిక కూడా వీరే దగ్గరుండి చూసుకుంటారు.
నిరాశలో క్యాడర్...
కానీ బీఆర్ఎస్ నేతల్లో మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత కొంత నిరాశ ఏర్పడింది. కేసీఆర్ నాయకత్వం నాడు రెండు సార్లు అధికారంలోకి తెస్తే.. కేటీఆర్ నాయకత్వంలో పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్న భావన కలుగుతుంది. గెలుపు పై ధీమా పెద్దగా లభించడం లేదు. హరీశ్ రావు, కేటీఆర్ లు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు కూడా పెద్దగా జనంలోకి వెళ్లడం లేదు. అంతే కాకుండా క్షేత్రస్థాయిలో క్యాడర్ ను కూడా సిద్ధం చేయడంలో వీరిద్దరు విఫలమవుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కేసీఆర్ నామమాత్రంగానే మారిపోవడంతో పార్టీకి భవిష్యత్ ఉంటుందా? లేదా? అన్న భయం కూడా కార్యకర్తల్లో నెలకొని ఉంది.
కవిత ప్రశ్నలతో...
మరొకవైపు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత హరీశ్ రావును టార్గెట్ చేస్తుండటం కూడా రాజకీయంగా ఇబ్బందికరంగా మారనుంది. కవిత జిల్లాల పర్యటనలతో పాటు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ లో నాయకత్వంపై ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీ విమర్శలకు సమాధానం చెప్పేకంటే కవిత వే్స్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితిని బీఆర్ఎస్ నాయకత్వం ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కారు పార్టీకి అంత సులువు కాదని అంటున్నారు. స్థానిక నాయకత్వం కొంత యాక్టివ్ గా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వ్యూహాల ముందు కేటీఆర్, హరీశ్ రావులు తేలిపోతారేమోనన్న బెంగ పట్టుకుంది.
Next Story

