Fri Apr 10 2026 22:18:17 GMT+0530 (India Standard Time)
Summer Effect : వానలు ఆగిన తర్వాత చుక్కలు కనపడతాయట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పగటి వేళ ఎండల తీవ్రత, సాయంత్రం సమయాల్లో అకాల వానలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ భిన్నమైన వాతావరణం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుజిల్లాల్లో గాలి వానలతో కూడిన వాతావరణం నెలకొంది. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రానున్న రెండు రోజులు...
రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఎండలు, వానలు కలసి వస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు ఉత్తర కోస్తా ప్రాంతంలో కురుస్తాయని చెప్పింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా అధికారులు తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ అక్కడక్కడ వానలు పడతాయని, అదే సమయంలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.
తెలంగాణలో అలెర్ట్...
తెలంగాణ ప్రజలకు అలర్ట్. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కుస్తాయని తెలిపింది. మూడు రోజుల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగొచ్చని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగడంతో ఉక్కపోత, సెగగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.
Next Story

