Sat Mar 14 2026 11:40:11 GMT+0530 (India Standard Time)
Summer Effect : ఇప్పుడే ఇలా ఉంటే రోహిణీ కార్తెలో బద్దలవుతాయా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెల రెండో వారంలో నలభై డిగ్రీలు దాటుతుండటంతో రానున్న కాలంలో నలభై ఎనిమిది డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రోహిణి కార్తెలో బండలతో పాటు ఏమేం పగులుతాయో భయంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ వేసవి మాత్రం అత్యంత తీవ్రతతో ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవాల్సి వస్తుందని వైద్యులు సయితం హెచ్చరిస్తున్నారు.
పొడి వాతావరణం...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పలు చోట్ల నలభై డిగ్రీలు దాటాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పల్నాడు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వేడి గాలులు మొదలయ్యాయి. సెగ మొదలుకావడంతో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ వేసవిలో విద్యుత్తు కోతలు లేకుండా చూడాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మరొకవైపు ఆదివారం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.
వారం రోజులు వానలే...
తెలంగాణలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15, 16 తేదీల్లో వానలు పడతాయని తెలిపింది. కొన్నిజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ వానలు పడతాయని చెప్పింది. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల వాతావరణంలో ఈ మార్పులు కనిపిస్తాయనిఅధికారులు చెబుతున్నారు. సూర్యాపేట, నల్లగొండ,భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి,పెద్దపల్లి, కరీంనగర్,రాజన్నసిరిసిల్ల,జగత్యాల,నిజామాబాద్,నిర్మల్,మంచిర్యాల,కుమ్రంభీ ఆసిఫాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ నెల 15, 16తేదీలో వర్షాలు కురుస్తాయని, ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.
Next Story

