Mon Feb 16 2026 11:55:42 GMT+0530 (India Standard Time)
Telangana : చివరికి చెయ్యెత్తేదెవరికి... వారే మేయర్లు.. వారే ఛైర్మన్లు
నేడు తెలంగాణలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది.

నేడు తెలంగాణలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. తెలంగాణలో జరిగిన 116 మున్సిపాలిటీల్లో ఛైర్మను, వైస్ ఛైర్మన్లు, ఏడు కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నేడు జరగనుంది. అయితే ఎవరు చివరి క్షణంలో చేతులు ఎత్తుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హంగ్ ఏర్పడటంతో కౌన్సిలర్లను క్యాంప్ లకు తరలించారు. బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మహారాష్ట్రకు తరలించారు. కాంగ్రెస్ కు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను హైదరాబాద్ కు తరలించారు. క్యాంప్ నుంచి ఈరోజు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకు వస్తారు. కమ్యునిస్టులు తమ కార్పొరేటర్లను విజయవాడకి తరలించారు.
మున్సిపాలిటీలు ఎవరివో?
రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలకు జరగ్గా, 35 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మూడు కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కరీంగనర్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. పరకాల, అలంపూర్, నర్సాపూర్, జిన్నారం, కేసముద్రం, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, జమ్మికుంట, జనగామ, కామారెడ్డి, అమరచింత, కోహీర్, దేవరకద్ర, ఆసిఫాబాద్, వేములవాడ, రాయికల్, జహీరాబాద్, మహబూబాబాద్, ఆలియాబాద్, బోధన్, గద్వాల, బెల్లంపల్లి, క్యాతనపల్లి తదితర మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. కొన్నింటిలో అధికార కాంగ్రెస్ ఇప్పటికే ఇతర పార్టీల కౌన్సిలర్లను తీసుకు రావడంతో కొంత ఛైర్మన్ ఎన్నికకు మార్గం సుగమం చేసుకుంది. జగిత్యాలలో ఏఐసీసీ నిర్ణయం మేరకు జీవన్ రెడ్డి తన అనుచరుల మద్దతు ఉంటుందని చెప్పడంతో ఇది కూడా కాంగ్రెస్ పరమవుతుంది.
మూడు కార్పొరేషన్లలో టెన్షన్...
నిజామాబాద్ కార్పొరేషన్లలో కాంగ్రెస్, ఎంఐఎం కలసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవిని తీసుకుని అధికారాన్ని పంచుకుంటున్నాయి. కాంగ్రెస్ కు మేయర్, ఎంఐఎం కు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కొత్త గూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్, సీపీఐ కలసి చెరి రెండేళ్లు మేయర్ పదవిని తీసుకోవాలని ఒప్పందం కుదిరింది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లుంటే అందులో 30 బీజేపీకి వచ్చాయి. ఒక బీజేపీ రెబల్ అభ్యర్థి, మరొక స్వతంత్ర అభ్యర్థి బీజేపీలో చేరారు. కో ఆప్షన్ ఓటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇద్దరు ఎమ్మెల్సీల ఓటుతో 33కు చేరడంతో బీజేపీ మేయర్ పదవిపై ధీమాగా ఉంది. కానీ కరీంనగర్ లో తమదే గెలుపు అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడంతో ఈ సీటు ఎవరికి దక్కనుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎవరి వైపు చివరి క్షణంలో కార్పొరేటర్లు చేతులెత్తితే వారిదే మేయర్ పీఠం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తరహా వాతావరణం నెలకొంది.
Next Story

