Fri Mar 20 2026 12:08:32 GMT+0530 (India Standard Time)
Telangana : భట్టి బడ్జెట్ లో ఈ సారి వీటికే పెద్దపీట.. పద్దుల్లో అగ్రస్థానం వీటిదే
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇంకా ఎన్నికలకు వాస్తవానికి రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఉంది. మహా అయితే మరొక బడ్జెట్ మాత్రమే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే జమిలి ఎన్నికలు జరిగితే 2029 లో తెలంగాణ శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతాని అంచనాలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసుకుంటే ఈ బడ్జెట్ తో పాటు మరో బడ్జెట్ మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
ఎన్నికలకు ముందు...
అందుకే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా మల్లు భట్టి విక్రమార్క ఈసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముందని అంటున్నారు. ఇప్పటి వరకూ రేవంత్ సర్కార్ పై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్న అపవాదును ఈ బడ్జెట్ ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తారని తెలిసింది. ముఖ్యంగా మహిళలకు నెలకు 2,500 రూపాయలు, విద్యార్థినులకు ఈ స్కూటర్ల పంపిణీ, చేయూత పింఛన్ల పెంపుదల, కల్యాణ లక్ష్మి వంటి పథకాలకు సంబంధించి ఈ బడ్జెట్ లో చోటు దక్కే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి.
సంక్షేమ పథకాలకు...
ఇప్పటికే బడ్జెట్ పై పూర్తి స్థాయి కసరత్తులు చేసిన ప్రభుత్వం ప్రభుత్వోద్యోగుల సంక్షేమానికి కూడా తగినన్ని నిధులను కేటాయించే అవకాశముందని చెబుతున్నారు. ఈ ఏడాది మల్లు భట్టి విక్రమార్క 3.20 లక్షల కోట్లకు పైగానే ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు. ఈ నెల 20వ తేదీన బడ్జెట్ ను మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనుండటంతో సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. శాసనమండలిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది 3.04 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి 3.30 లక్షల కోట్ల రూపాయల వరకూ పెంచుతూ ప్రవేశపెట్టనుందని తెలిసింది. ప్రభుత్వ స్థలాల బహిరంగ వేలం ద్వారా సమకూరిన ఆదాయన్ని పెంచుకోవడం వల్ల హామీలను నెరవేర్చవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తుంది. వ్యవసాయానికి కూడా ఈ బడ్జెట్ లో పెద్ద పీట వేయనున్నారు.
Next Story

