Sun Dec 08 2024 09:04:10 GMT+0000 (Coordinated Universal Time)
Telangana BJP : చేరికల కమిటీ చేష్టలుడిగి చూస్తుందా.. ఏంది?
మూడు నెలల నుంచి బీజేపీలో చేరికలే లేవు. ఎవరైనా వచ్చి చేరతారని భావిస్తే ఎవరూ చేరకుండా ముఖం చాటేస్తున్నారు
మూడు నెలల క్రితం నుంచి బీజేపీలో చేరికలే లేవు. ఎవరైనా వచ్చి చేరతారని భావిస్తే ఎవరూ చేరకుండా ముఖం చాటేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. అగ్రనేతలందరూ రాష్ట్రానికి వచ్చి వెళుతున్నా పాత ముఖాలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు ఉన్నోళ్లు కూడా వెళ్లిపోతున్నారు. తెలంగాణ ఎన్నికలు సమీపించే సమయంలో బీజేపీకి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామమే. ఎంత ఊపు కనపడాల్సిన పార్టీలో ఉదాసీనత కనిపిస్తుండటంతో ఆ పార్టీలో "కళ" ఇప్పుడే కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో కనీసం ఐదారు స్థానాలు దాటతాయా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. ఇక ఎన్నికల వేళ చేరికల మాట అటు ఉంచితే ఉన్నోళ్లను కాపాడుకోవడం కూడా కమలం పార్టీకి కష్టంగా మారింది.
కోమటిరెడ్డి రాజీనామాతో...
తాజాగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో ఉండలేక తక్కువ కాలంలోనే పార్టీని వీడారు. బీజేపీ ఎదగలేకపోయిందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించలేకపోయిందని ఆయన పార్టీ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి గత కొద్ది రోజులుగా యాక్టివ్ గా లేరు. అప్పుడే పార్టీ అధినాయకత్వానికి అనుమానం వచ్చి తొలి జాబితాలో పేరు కూడా కన్పించలేదు. అంటే బీజేపీ కూడా మానసికంగా కోమటిరెడ్డి పార్టీని వీడతారని ముందే తెలిసిన పార్టీ హైకమాండ్ టిక్కెట్ ఇవ్వకుండా జాగ్రత్త పడింది.
మరికొందరు అదే బాటలో...
ఒక్కకోమటిరెడ్డితోనే ఈ వలసలు ఆగుతాయా? అని చెప్పడానికి లేదు. ఇంకా చాలా మంది లైన్లో ఉన్నారంటున్నారు. పార్టీని వీడనున్నారని ప్రచారం జరుగుుతన్న వారిలో గడ్డం వివేక్ తో పాటు విజయశాంతి పేరు కూడా వినపడుతుంది. ఇటీవల మోదీ సభలకు కూడా విజయశాంతి దూరంగా ఉండటంతో ఈ ప్రచారం ముమ్మరమయింది. విజయశాంతి, గడ్డం వివేక్ లను పార్టీలోకి తీసుకు రావాలని కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. వారితో సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే వారి చేరికపై ఒక క్లారిటీ వస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు "తెలుగు పోస్ట్" కు చెప్పారు. అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ చేరికలపై క్లారిటీ వస్తుందని తెలిపారు.
ఈటల బ్యాచ్...
అయితే మూడు నెలల క్రితం వరకూ బీజేపీలో కొంత జోష్ కనిపించింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న విధంగా బిల్డప్ చేశారు కమలనాధులు. ఇందుకోసం ఈటల రాజేందర్ అధ్కక్షతన చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ చేరికల కమిటీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పొంగులేటి వంటి వారు కూడా తన ఇంటికి వచ్చిన వారికి టీ ఇచ్చి సున్నితంగా తిరస్కరించి పంపేసి హస్తంగూటిలో ఒదిగిపోయారు. అమిత్ షా వచ్చినా, మోదీ వచ్చినా చేరే వారు లేరు. ఇక చేరికల కమిటీ కూడా లేనట్లే. ఎందుకంటే ఏవైనా చేరికలుంటే గాంధీ భవన్ వైపే ఉంటున్నాయి. ఎక్కడా సీటు రానివాళ్లు ఇటు చూడాల్సిందే తప్ప బలమైన నేతలు కూడా బీజేపీ నుంచి జారిపోయేట్లే కనిపిస్తుంది. ఈటల బ్యాచ్ ఏం చేస్తున్నారనన ప్రశ్నలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
Next Story