Fri Mar 27 2026 09:53:10 GMT+0530 (India Standard Time)
Bhadrachalam : సీతారాముల కల్యాణ్యం చూతము రారండి
శ్రీరామ నవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబయింది.

శ్రీరామ నవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబయింది. నేడు జరిగే సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు ఇప్పటికే వేలాది మందిభద్రాద్రి చేరుకున్నారు. మిధిలా స్టేడియంలో కల్యాణ వేదికపై సీతారాముల పరిణయం నేడు జరగనుంది. కల్యాణాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. భద్రాద్రికి వచ్చేభక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు చేశారు.
మిధిలా స్టేడియంలో చలువ పందిళ్లు...
మిధిలా స్టేడియంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. కల్యాణ మండపాన్ని పూల మండలాతో అలంకరించారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు అవసరమైన కూలర్లను కూడా ఏర్పాటు చేశారు. చల్లటి మంచినీరు, మజ్జిగను భక్తులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. గోదావరి నదీ తీరంలో స్నానమాచరించిన భక్తులు తర్వాత మిధిలా స్టేడియానికి చేరుకుంటారు. అనేక చోట్ల తాత్కాలిక మందిరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాన్ని పంచేందుకు మూడు లక్షల లడ్డూలు, ఐదు లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను కూడా పంపిణీ చేయనున్నారు.
నేడు భద్రాద్రిలో అభివృద్ధి పనులు...
ప్రత్యేకంగా భక్తులకు విశ్రాంతి మందిరాలను తాత్కాలికంగా నిర్మించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మొత్తం నాలుగు వందలకు పైగానే బస్సులను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ సందర్భంగా రెండు వేల మంది పోలీసులను భద్రత కోసం నియమించారు. నేడు భద్రాద్రి రామాలయం అభివృ్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మొత్తం 586 కోట్ల రూపాయలతో ఈ పనులను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Next Story

