తొలి కప్పు అదృష్టం ఎవరిదో.. రెండు రోజులు ఆగకుండా వర్షం పడితే?
తొలి కప్పు కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండు జట్ల మధ్య అంతిమ సమరానికి వేళయింది.

తొలి కప్పు కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండు జట్ల మధ్య అంతిమ సమరానికి వేళయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండడంతో హోరాహోరీ సమరం ఖాయమైంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండడంతో ఫైనల్కు రిజర్వ్ డే ఉంది.
షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డుతగిలితే, తొలుత ఆటను పూర్తి చేయడానికి అధికారులు 120 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. రాత్రి 11:56 గంటల వరకు కూడా పూర్తి 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే, చెరో ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించి ఫలితాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తారు. ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించడం సాధ్యపడని పక్షంలో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే, సమయం ఉన్నంత వరకు మరో సూపర్ ఓవర్, అదీ టై అయితే ఇంకో సూపర్ ఓవర్ చొప్పున ఆడిస్తారు. ఒకవేళ వర్షం కారణంగా సూపర్ ఓవర్ నిర్వహించడం కూడా అసాధ్యమైతే ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే జూన్ 4న మ్యాచ్ను నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజున, అంతకుముందు రోజు మ్యాచ్ ఏ దశలో ఆగిపోయిందో, అక్కడి నుంచే కొనసాగిస్తారు. రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా ఆట పూర్తిగా రద్దయితే, అప్పుడు ఐపీఎల్ నియమావళి ప్రకారం లీగ్ దశ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును ఛాంపియన్గా ప్రకటిస్తారు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది కాబట్టి ఆ జట్టునే విజేతగా ప్రకటిస్తారు.