Fri Dec 05 2025 12:40:17 GMT+0000 (Coordinated Universal Time)
మాటలు రావడం లేదు: విరాట్ కోహ్లీ
బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆనందోత్సాహాలు విషాదంగా మారాయి. నగరంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, మరో 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ కార్యక్రమానికి సరిగ్గా ప్రణాళిక లేకపోవడం, అభిమానుల సంఖ్యను తక్కువగా అంచనా వేయడం మరియు స్టేడియంలో ప్రవేశానికి ఉద్దేశించిన పరిమిత సంఖ్యలోని ఉచిత పాసుల పంపిణీపై గందరగోళం నెలకొనడం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నానికే విధానసౌధ, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు సుమారు రెండు లక్షల మంది అభిమానులు చేరుకున్నారు.
ఆర్సీబీ యాజమాన్యం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రకటించింది. ఉదయం ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటికే భారీగా చేరుకున్న అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. ఈ విషాద ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. విరాట్ కోహ్లీ ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదని, తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు.
Next Story

